‘మిగతా రాజకీయ పార్టీలు వేరు.. జనసేన పార్టీ వేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా లక్షలాది మంది అభిమానుల్ని కలిగి వున్న సినీ కథానాయకుడు. సినిమా హీరో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఆయన్ని ఆరాధించే లక్షలాదిమంది అభిమానులున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చితేగానీ ఈ స్థాయికి ఓ వ్యక్తి రావడం కష్టం.
ఎంతోమందిని ఆయన చూసి వుంటారు. తనను నిలబెట్టి మార్కెట్లో అమ్మేసే ఎంతోమందిని ఆయన చూసి వుంటారు.. అందుకే, ఎవర్ని నమ్మాలి.? అన్న విషయమై ఆచి తూచి వ్యవహరిస్తుంటారాయన. ఒక్కోసారి మంచి వారిని కూడా ఆయన అనుమానించాల్సి వస్తుంది..’ అంటున్నారు ఒకప్పటి జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర.
ప్రస్తుతం జనసేన పార్టీకి దూరంగా వున్న కళ్యాణ్ దిలీప్, న్యాయవాదిగా వృత్తి పరంగా బిజీగా వుంటూనే, ఇంకోపక్క సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై తనదైన విశ్లేషణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ జీవితం, జనసైనికుల ఎమోషన్స్.. వంటి అంశాలపై ఇటీవల ఓ విశ్లేషణ చేశారు.
తన చుట్టూ వున్న కొందరు, తనను ఇతర పార్టీల దగ్గర చులకన చేయడమో, తన పేరు చెప్పి, ఇతర పార్టీల దగ్గర పాపులారిటీ పొందడమో చేస్తోంటే, అలాంటివారిని పవన్ కళ్యాణ్ గుర్తించి ముందే నిలువరించడం కష్టసాధ్యమైన పని అని కళ్యాణ్ దిలీప్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నిందించాల్సిన అవసరమే లేదన్నది దిలీప్ అభిప్రాయం.
పవన్ కళ్యాణ్ నిజాయితీ కలిగిన వ్యక్తి.. రాజకీయాల్లో ఓ నిబద్ధతతో పనిచేస్తున్నవ్యక్తి.. అంటూ సర్టిఫై చేసిన దిలీప్, ఏ పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నా.. ఆయన స్వయం ప్రకాశితుడు.. ఆయన నిర్ణయాల్ని తప్పు పట్టడం కంటే, ఆయన్ని ఫాలో అవడమే జనసైనికుల ముందున్న లక్ష్యమని అన్నారు.
సముద్రం లోతుల్ని చూడాలంటే.. ముందుగా కెరటాల అలజడిని తట్టుకోవాలి. ఆ కెరటాల అలజడికే బెదిరిపోతే, లక్ష్యాన్ని చేరలేమన్న విషయాన్ని జనసైనికులు గుర్తుంచుకోవాలన్నారు దిలీప్ కళ్యాణ్. జనసేన పార్టీలోకి ఏదో ఒక అవసరంతో కొందరు వస్తుంటారు, అవసరం తీరాక జనసేన మీద విమర్శలు చేస్తుంటారు. అలాంటివారిని పార్టీలోనే కొనసాగించేందుకోసం పవన్ ప్రయత్నించాల్సిన అవసరం లేదు.
అరిచే ప్రతి కుక్కకీ బిస్కెట్ వేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి వుంటుందని నేననుకోవడంలేదు.. అన్నది కళ్యాణ్ దిలీప్ సుంకర బల్లగుద్దిమరీ చెబుతున్న విషయం.