సినిమా టిక్కెట్ల ధరల పెంపు విషయమై చాలాకాలంగా ఓ పద్ధతి నడుస్తోంది. మారిన సినీ సమీకరణాల నేపథ్యంలో తొలి వారం.. వీలైతే రెండో వారం.. లేదంటే కొద్ది రోజులపాటు సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచుకునేందుకు ఆయా చిత్రాల నిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ కారణంగానే, తెలుగు సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేసి.. 200 కోట్లు, ఆ పైకి ఎగబాకేసింది.
ఇప్పడంతా పాన్ ఇండియా సినిమాల వైపే చూస్తున్నారంతా. ఇలాంటి సమయంలో, ‘వకీల్ సాబ్’ సినిమా టిక్కెట్ల ధర విషయమై ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్సీపీ కుట్రపూరిత రాజకీయానికి తెరలేపింది. పవన్ కళ్యాణ్ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైసీపీ సర్కార్, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ‘వకీల్ సాబ్’ సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచుకోవడానికి అనుమతివ్వలేదు. న్యాయపరమైన చిక్కులు రాకుండా హడావిడిగా ప్రభుత్వ ఆదేశాలు, అందుకు అనుకూలంగా జీవోలూ విడుదలయ్యాయి.
ఇక, ఇప్పుడు సవరణలతో కూడిన కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. టిక్కెట్ల ధరల పెంపుపై ఆయా సందర్భాల్ని బట్టి నిర్ణయాలు తీసుకునేలా కొత్త ఆదేశాలు విడుదలవడం గమనార్హం. అంటే, తమకు ‘జీ హుజూర్’ అనేవారి సినిమాల టిక్కెట్ల ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందన్నమాట. నచ్చనివారి సినిమాలకైతే టిక్కెట్ల ధరల్ని నియంత్రిస్తుందన్నమాట.
రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన అందిస్తామని గద్దెనెక్కే పాలకులు ఇలా వ్యవహరించడమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. సినిమా అనేది నిత్యావసర వస్తువు కాదు. అది జస్ట్ ఓ వినోదం. సినిమా థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు, అక్కడి టిక్కెట్ల ధరల్ని చూసి సినిమాకి వెళ్ళాలా.? వద్దా.? అన్నది నిర్ణయించుకోగలరు. పైగా నచ్చిన సినిమానే చూస్తారు ప్రేక్షలు. నచ్చని సినిమా కోసం ఎంత హంగామా చేసినా ప్రయోజనం వుండదు. అలాంటప్పుడు, సినిమా టిక్కెట్ ధరల్ని నియంత్రించాలన్న కుత్సిత ఆలోచన ప్రభుత్వానికి రావడమేంటి.?
పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. వాటిని నియంత్రించడం పాలకులకు చేత కావడంలేదు. నిత్యావసర వస్తువుల ధరలూ సామాన్యుడికి షాకిస్తున్నాయి.. వాటిపైనా ప్రభుత్వానికి నియంత్రణ చేతకావడంలేదు. కానీ, వినోదం.. అత్యవసరం కాని అంశంపై నియంత్రణ పేరుతో ఈ పిల్లిమొగ్గలేంటో.?