జనసేన భావజాలం.. ప్రజలకు అర్థమవుతోందా.?

పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన.. విలువైన జలాల్ని వృధాగా సముద్రంలోకి వదిలేసుకుంటున్న దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంకోపక్క, రాష్ట్రాన్ని అప్పులు ముంచెత్తుతున్నాయి.. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. తేడా ఏం లేదు, ఒకర్ని మించి ఇంకొకరు అప్పులు చేసేస్తున్నారు. తప్పొప్పులు.. నిందారోపణలతో వైసీపీ, టీడీపీ తమ స్థాయిని దిగజార్చేసుకుంటున్నాయి.

స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ, వైసీపీ మాట్లాడటంలేదు. ప్రత్యేక హోదా గురించి ఎప్పుడో మర్చిపోయారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేదే కనిపించడంలేదు. సంక్షేమ పథకాల హోరులో తాము అప్పులపాలైపోతున్నామన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించలేరన్న గట్టి నమ్మకంతో అధికారంలో వున్న వైసీపీ అనుకుంటోంది. కానీ, కింది స్థాయిలో ప్రజలు వాస్తవాల్ని గ్రహిస్తున్నారు. ఒక్కో సంక్షేమ పథకం తమ నెత్తిన బోల్డంత అప్పుని మోపుతోందనీ, తమకు చిల్లర విదిల్చి, అధికార పార్టీ.. రాజకీయ నిరుద్యోగులకు సలహాదారుల పేరుతోనో, నామినేటెడ్ పోస్టులతోనో పెద్ద మొత్తంలో దోచిపెడుతున్న వైనాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు.

అప్పుడు చంద్రన్న కానుక, ఇప్పుడు జగనన్న కానుక.. పేరేదైనా, అవి తమ నెత్తిన మోయిలేని అప్పుల భారాన్ని మిగుల్చుతున్న వైనం గురించి జనం చైతన్యవంతులవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రం ఏమవుతుందో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన పరిస్థితి.

రాజకీయ కక్ష సాధింపులు తప్ప, రాష్ట్రంలో అభివృద్ధి లేదు. గడచిన రెండేళ్ళలో పాడైపోయిన రోడ్లకు మరమ్మత్తులు లేవు. రాజధాని అమరావతి అటకెక్కింది. వీటన్నిటినీ జనం విశ్లేషించుకుంటున్నారు. అయితే, జనసేన వైపు చూసేందుకు ప్రజలకు వున్న ఒకే ఒక్క ఇబ్బంది ఆ పార్టీ, బీజేపీతో జత కట్టడం. మరి, ఈ విషయంలో జనసేన పునరాలోచన చేస్తుందా.? చేయక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది.

అదే సమయంలో, జనసేన అధినేత జనంలోకి వెళ్ళడానికి సరైన సమయమిది. వెళ్ళి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడితే, జనసేనకి తిరుగే వుండదు.