పవన్ ప్రయాణం: కామన్ మేన్ నుంచి.. జనసేనాని వరకూ.!

పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ‘ఈ అబ్బాయెవరో తెలుసా.?’ అంటూ పవన్ కళ్యాణ్ తెరంగేట్రం కోసం అప్పట్లో వేసిన వాల్ పోస్టర్స్ దగ్గర్నుంచి.. పవన్ కళ్యాణ్ అలా రోడ్డు మీద నడిచి వెళితే లక్షలాది మంది యువత ఆయన వెంట నడిచేదాకా.. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ సాగించిన ప్రయాణం చాలా చాలా ప్రత్యేకం.

కేవలం సినిమాలతోనే పవన్ కళ్యాణ్ ఇంత ఫాలోయింగ్ సంపాదించారా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తుంటాయి. నో డౌట్, పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రభంజనం. చేసినవి తక్కువ సినిమాలే అయినా, తెలుగు సినీ పరిశ్రమపై, తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై ఆయన వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత.? అన్న ప్రశ్నకి 50 కోట్లు ఆ పైన.. అని సమాధానం వస్తోంది ఇప్పుడు. అదీ పవన్ కళ్యాణ్ రేంజ్.

అంతేనా, అంతకు మించి.. ఆయన ఓ మంచి మనిషి. మానవత్వానికి నిలువెత్తు చిరునామా పవన్ కళ్యాణ్. సినిమాల్లోనే పవన్ కళ్యాణ్ స్టైలింగ్.. రియల్ లైఫ్‌లో ఆయన చాలా సింపుల్‌గా వుంటారు. ఇదిప్పుడు కొత్తగా ఆయనకు అలవాటైందేమీ కాదు. చాలా ఏళ్ళుగా ఆయన సింప్లిసిటీని ఫాలో అవుతున్నారు. కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్, కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అప్పటికి తన ఖాతాలో వున్న డబ్బునంతా చెక్ రూపంలో రాసిచ్చేశారు ఆ సంస్థకి. పవన్ బాటలో చాలామంది విరాళాలిచ్చేందుకు ముందుకొచ్చారు. కానీ, ఆ తర్వాత పవన్, ఆ సంస్థ విషయంలో ఎందుకో అంత ఆసక్తి చూపలేదు.

దానికి కారణం, అంతకంటే బలమైన వేదిక గురించి ఆయన చేసిన ఆలోచనేనంటారు. ఆ బలమైన వేదికగా ప్రజారాజ్యం పార్టీని ఆయన భావించారు. కానీ, కొన్ని అనుకోని కారణాలతో పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగా ప్రజారాజ్యం పార్టీ నడవలేదు. ఆ తర్వాత తానే స్వయంగా రంగంలోకి దిగి జనసేన పార్టీని స్థాపించారు. అప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ‘సాయం’ చేయడంలో ఒకే పంథా అవలంభిస్తున్నారు.

సైనికుల సంక్షేమం కోసం పెద్దయెత్తున విరాళమిచ్చినా, కోవిడ్ వేళ అటు విరాళాలు ఇచ్చి, ఇటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలెండర్లు అందించినా.. జనానికి నేరుగా ఆక్సిజన్ లభ్యమయ్యేలా చేసినా.. అదంతా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతాయి. గుప్తదానాల విషయంలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని మించిన మానవతావాది.. అనడం అతిశయోక్తి కాదేమో.

జనసేనాని.. అంటే, జనసేన పార్టీకి అధినేత అని మాత్రమే కాదు.. జనంలో మార్పు కోసం.. రాజకీయాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్న సేనాని. ప్రభుత్వాన్ని నడుపుతూ, ‘సాయం’ ప్రకటించేసి చేతులు దులుపుకునే నాయకులకి, రాజకీయాల్లో వుండి.. పార్టీ ఫండ్స్ రూపంలో హడావిడి చేసేవారికి.. నిఖార్సుగా.. తన కష్టార్జితాన్ని ప్రజలకోసం ఖర్చు చేసే పవన్ కళ్యాణ్‌కీ చాలా చాలా తేడా. అందుకే ఆయన జనసేనాని అయ్యారు.