2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ యువ రాజ్యం సారధిగా పనిచేసిన సినీ నటుడు పవన్ కళ్యాణ్, 2014 ఎన్నికలకొచ్చేసరికి జనసేన పార్టీ స్థాపన, ఆ పార్టీ అధినేత హోదాలో తెలుగుదేశం పార్టీకీ, భారతీయ జనతా పార్టీకీ మద్దతిచ్చారు తప్ప, జనసేన పార్టీని ఎన్నికల బరిలోకి దింపలేకపోయారు.
2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మలచేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా, ‘నడుస్తున్న చిత్ర విచిత్రమైన రాజకీయాల’ నడుమ, జనసేన పార్టీ నిలదొక్కుకోలేకపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి, జనసేన పార్టీ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రమెలా వుండబోతోంది.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ వాక్యూమ్ సుస్పష్టంగా వుంది. ఆ వాక్యూమ్ భర్తీ చేసే అవకాశమైతే జనసేన పార్టీకి వుంది. కానీ, ప్రజల్లో చైతన్యాన్ని జనసేన పార్టీ కోరుకుంటోంది.
ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న ‘సంకుచిత’ ఆలోచనలు జనసేన పార్టీకి లేవు. అదే ఇప్పుడున్న రాజకీయాల్లో జనసేన పార్టీకి అతి పెద్ద సమస్యగా మారుతోంది. ఎన్నికలంటే కోట్లు ఖర్చు చేయాలి.. ఓట్లను కొనెయ్యాలి.. ప్రజల్ని మభ్యపెట్టాలి. అధికారంలోకి వచ్చాక జనాన్ని వంచించాలి. ఇదీ నడుస్తున్న రాజకీయం.
అక్కడా ఇక్కడా అన్న తేడాల్లేవ్.. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా కూడా లేదు. కానీ, ఇలా ఎన్నాళ్ళు.? ఈ ప్రశ్న చుట్టూనే జనసేన ఆలోచనలు ఆగిపోతున్నాయి. మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. జనసేన పార్టీ కొన్ని చోట్ల తన ఉనికిని కాపాడుకున్నా, అక్కడ ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురైన దాడులకు, జనసైనికుల్లో కొందరు నిలదొక్కుకోలేకపోయారు. కొందరు జనసైనికులు రక్తమోడిన పరిస్థితిని కూడా చూశాం.
పార్టీ ఆర్థికావసరాల కోసం (న్యాయ బద్ధమైన అవసరాల కోసం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మళ్ళీ పవర్ స్టార్‌గా మారక తప్పలేదు. కరోనా పాండమిక్ నేపథ్యంలో సినిమాల నిర్మాణం ఆలస్యమయ్యింది. అటు నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇటు పార్టీ కార్యకలాపాల్ని ఆపకూడదు.
రెండు పడవల మీద ప్రయాణం ఎంత కష్టమో గతంలోనే మెగాస్టార్ చిరంజీవి, తన అనుభవంతో చెప్పారు. ‘నేను చేయలేకపోయింది, నా తమ్ముడు చేసి చూపిస్తాడు..’ అని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద తనకున్న నమ్మకాన్ని కుండబద్దలుగొట్టేశారు. మరి, అన్నయ్య నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెడతారా.? రాజకీయమంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం.. అధికార పీఠమెక్కడమంటే, ప్రజలకు సేవ చేయడం.. అన్న మాటల్ని జనసేనాని చేతల్లో చూపిస్తారా.? ఆ రోజెప్పుడు.? వేచి చూడాల్సిందే.