పవన్ కళ్యాణ్, ‘పవర్ స్టార్’ని వద్దనుకున్నారా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… షార్ట్ ఫామ్.. పి.ఎస్.పి.కె.. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించాలంటే, ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అని వుండాల్సిందే. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించిన ఏదన్నా ప్రకటన వస్తే, ‘పిఎస్‌పికె’ అని ముందు వుంటుంది, ఆ తర్వాత సినిమా నెంబర్ వుంటుంది. అయితే, ఇకపై కేవలం, ‘పవన్ కళ్యాణ్’ అని మాత్రమే మనం బిగ్ స్క్రీన్ మీద పేరు చూడబోతున్నాం. మీడియాలోనూ, ఇకపై పవర్ స్టార్ కనిపించకపోవచ్చు. పిఎస్‌పికె ప్రస్తావన కూడా వుండకపోవచ్చు. అభిమానులు కాస్త నిరాశచెందినా.. ఇది తప్పదు.

సినిమా టైటిల్ కింద ట్యాగ్.. కూడా చాలా సినిమాలకు తప్పనిసరి అవుతోంది.. భీమ్లా నాయక్ విషయంలో అలాంటి ట్యాగ్ ఏమీ వుండబోదు. దీనికి సంబంధించి డైలాగు కూడా ఇప్పటికే ఓ ప్రోమోలో వదిలేశారు. అసలెందుకిదంతా.? నిజానికి, పవన్ కళ్యాణ్ తన పేరు ముందున్న ‘పవర్ స్టార్’ అనే ట్యాగ్‌ని పెద్దగా ఇష్టడలేదెప్పుడూ. అభిమానులు, చిత్ర దర్శక నిర్మాతలు.. ఆ ట్యాగ్ వాడటం మొదలెట్టారు. ఆ మధ్య ‘పవర్ స్టార్’ ట్యాగ్ ఇచ్చింది పోసాని కృష్ణమురళి.. అంటూ ఓ కథనం మీడియాలో సర్క్యులేట్ అయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.

జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్, జనసేనానిగా జనంతో పిలిపించుకోవాలన్న ఆలోచనతోనే మొదటినుంచీ వున్నారు. దానికి ‘పవర్ స్టార్’ అనే ట్యాగ్ కాస్త ఇబ్బందికరంగా మారుతోందని పవన్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మరోపక్క, ‘పవర్ స్టార్’ పేరుతో ఇతర భాషల్లో కొందరు హీరోలు, కొందరు కామెడీ హీరోలూ హల్‌చల్ చేస్తుండడంతో, వారి పేరుతో వచ్చే వార్తలకు మనోళ్ళు.. అదేనండీ మన మీడియా జనాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని వాడేస్తున్నారు.. ఇలాంటివాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, పవన్.. తన నిర్మాతలకు ‘పవర్ స్టార్’ విషయమై స్పష్టమైన ఆదేశాలిచ్చారట.

అదే సమయంలో, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయమై సానుకూలంగానే స్పందిస్తున్నారు. ‘పిఎస్‌పికె’ అనే ప్రస్తావన గత కొద్ది రోజులుగా తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రస్తావనే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది.