జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మళ్ళీ ‘రౌండ్ టేబుల్ సమావేశం’ అంటున్నారు. అదీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మేధోమధనం కోసం. ‘ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్.. దివాళా తీసే దిశలో ఆంధ్రప్రదేశ్ వుందని ఆర్థిక నిపుణులు, మేధావులు చెబుతున్న విశ్లేషణలు వింటోంటే హృదయం భారంగా మారుతోంది..’ అంటూ జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు లక్షల కోట్ల అప్పులు, మరో అర లక్ష కోట్ల బకాయిలు, తాకట్టులో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు.. ఎందుకీ దుస్థితి.? అన్న అంశంపై చర్చ జరగాలన్నది జనసేన అధినేత ఉవాచ. అధికార వైసీపీతోపాటు అన్ని రాజకీయ పక్షాలు, అలాగే ఆర్థిక నిపుణులు, ఇతర మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని జనసేనాని ఆకాంక్షిస్తున్నారు.
జనసేనాని పేర్కొన్న లిస్టులో జస్టిస్ లక్ష్మణరెడ్డి, ఆంజనేయరెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, జయప్రకాష్ నారాయణ, చలసాని శ్రీనివాసరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులున్నారు. అంతే కాదు, రైతు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ, కార్మిక, సచివాలయ, ప్రజా సంఘాల నాయకులకూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
అయినా, పవన్ కళ్యాణ్ ఛాదస్థం కాకపోతే.. రాష్ట్రం ఏమైపోతే ఎవడిక్కావాలి.? సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయా.? లేదా.? అన్నదే ముఖ్యమిక్కడ. రోడ్లు నాశనమైపోయి, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోతున్నా, ప్రభుత్వాల్ని నిలదీయలేకపోతున్న ప్రజల కోసం పవన్ పోరాడి ఉపయోగమేంటి.?
ఆర్థిక సంక్షోభం లాంటి మాటలు జనం చెవిన పడవు. ఎందుకంటే, వాళ్ళ లెక్కలు వేరే వుంటాయ్. ఓటు బ్యాంకు రాజకీయాల నడుమ, ప్రజలు ఎన్ని సంక్షోభాల్నయినా లెక్క చేయరు. ప్రజల్ని అలా ఓటు బ్యాంకు రాజకీయాల్లో ముంచేసి, పాలకులు వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అనేదిప్పుడు నయా రాజకీయం.
ప్రభుత్వాలు చేసే అప్పులకు జవాబుదారీ తామేనని ప్రజలకు అర్థమయ్యే పరిస్థితే లేదు. ఆ అప్పులకు వడ్డీ సైతం తామే కట్టాలని తెలుసుకోలేనంత అమాయకత్వమో, మూర్ఖత్వమో ప్రజల్లో పెరిగిపోయాక, అసలు తాము చైతన్యవంతులయ్యేదే లేదని పదే పదే ఓటర్లు తేల్చేస్తున్నాక.. ‘రౌండ్ టేబుల్’, మేధో మధనం.. అంటూ ఆర్థిక సంక్షోభంపై జనసేనాని ఆవేదన వ్యక్తం చేసి ఏంటి ఉపయోగం.?
ఆర్ధిక సంక్షోభంలో,
దివాళా తీసే దిశలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఆర్ధిక నిపుణులు, మేధావులు చెబుతున్న విశ్లేషణలు వింటుంటే హృదయం భారంగా మారుతోంది. ఆరు లక్షల కోట్ల అప్పులు,సుమారు మరో అరలక్ష కోట్ల బకాయిలు. తాకట్టులో ప్రభుత్వ ఆస్తులు.ఎందుకీ దుస్థితి…"(Cont..)— Pawan Kalyan (@PawanKalyan) October 10, 2021