రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్ జగన్ సర్కార్ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా హైకోర్టు ఈ వ్యవహారంపై ఇచ్చిన తీర్పుతో అధికార పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ‘సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం..’ అని వైసీపీ నేతలు, తమ ప్రభుత్వానికి తగిలిన ‘ఎదురు దెబ్బ’పై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా వుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీటేశారు. ‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు జనసేనాని.
ఇదిలా వుంటే, స్థానిక ఎన్నికల వేళ అధికార పార్టీ నేతల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. మహిళలపై నిస్సిగ్గుగా దాడులకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అసలంటూ విపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ‘వీరంగం’ సృష్టించారు. ఈ నేపథ్యంలో చాలామంది జనసేన అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయలేకపోయారు. జనసేన మాత్రమే కాదు బీజేపీ (జనసేన మిత్రపక్షం), టీడీపీ, ఇతర విపక్షాలూ బాధిత పార్టీలుగా మారిపోయాయి అధికార పార్టీ ఆగడాల నేపథ్యంలో.
ఈ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి దూరంగా వుంచాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారాయన. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఏకగ్రీవాలు జరగడంపైనా నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు.
నిమ్మగడ్డ తీరుపై మండిపడ్డ ప్రభుత్వం, ఆయన్ని పదవిలోంచి తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఆయన స్థానంలో కనగరాజ్‌ని ‘కరోనా కాలంలో’ నియమించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తమ్మీద, హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి షాక్ తగిలందని చెప్పొచ్చు. ‘రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమవ్వాలి..’ అనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయిప్పుడు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాధ్యతల్లోకి వచ్చినట్లయ్యిందనీ, త్వరలోనే వివిధ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
మొత్తమ్మీద, తాజా పరిణామాలు జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటుతామని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ‘ఇది వెరీ వెరీ స్పెషల్..’ అంటూ తాజా పరిణామాలపై జనసైనికులు సోషల్ మీడియాలో స్పందిస్తుండడం గమనార్హం.
ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది,అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది
— Pawan Kalyan (@PawanKalyan) May 29, 2020