బీజేపీ చర్యలు గమనిస్తున్నావా పవన్?

భారతీయ జనతా పార్టీతో కొన్ని నెలల కిందటే పొత్తు పెట్టుకుంది జనసేన. ఈ రెండు పార్టీలు కలిస్తే రెంటికీ బలం వస్తుందని.. బాగా బలహీన పడ్డ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంను వెనక్కి నెట్టి జగన్ సర్కారును ఈ రెండూ దీటుగా ఎదుర్కొంటాయని.. పవన్ ఆవేశానికి, ఆలోచనకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతు లభిస్తే ఏపీ రాజకీయం రంజుగా మారుతుందని అంతా అనుకున్నారు.

కానీ వాస్తవంగా చూస్తే జనాలు ఆశించినంతగా ఏమీ జగన్ సర్కారును జనసేన-భాజపా ఢీకొట్టడం లేదు. పవన్ కొంచెం సిన్సియర్‌గానే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నప్పటికీ భాజపా నుంచి సరైన సహకారం లభించడం లేదని.. అతను వాళ్లకు ఉపయోగపడుతున్నాడు కానీ.. తన పార్టీకి భాజపా వల్ల పెద్దగా ప్రయోజనం కలగట్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలేవీ చేపట్టకపోవడం ఇక్కడ గమనార్హం.

పవన్ పనిగట్టుకుని మోడీ సర్కారును పొగడ్డం, వాళ్ల కార్యక్రమాల్ని ఎండోర్స్ చేయడం చేస్తుండగా.. అటు వైపు నుంచి జనసేనకు అనుకూలంగా ఏమీ జరగట్లేదు. పైగా జగన్ సర్కారుకు పరోక్షంగా కేంద్రం సహకరిస్తోందని.. కీలకమైన అంశాల్లో తమ పోరాటానికి కలిసి రావడం, తోడ్పాటు అందించడం చేయడం లేదని జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

జగన్ సర్కారు అమరావతికి గండికొట్టి మూడు రాజధానుల ప్రతిపాదనతో తీర్మానం చేస్తే దీన్ని కేంద్రం ఏ రకంగానూ అడ్డుకోలేదు. దీంతో పవన్ ఇక్కడ చేస్తున్న పోరాటానికి అర్థం లేకుండా పోయింది. ఇటీవల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను జగన్ సర్కారు ఎంతగా టార్గెట్ చేసినా కేంద్రం స్పందించలేదు. ఆయన రాసిన లేఖ మీద కూడా చర్యలు కరవయ్యాయి.

ఇప్పుడేమో ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్‌తో ఆమోద ముద్ర వేయించుకుని ఈసీపై వేటు వేయించింది జగన్ సర్కారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసిన గవర్నర్‌కు కేంద్రం ఎంత చెబితే అంత. కరోనాపై పోరాడాల్సిన సమయంలో ఈ గొడవేంటి అని కేంద్రం ఆయన ద్వారా ఆర్డినెన్స్‌ను తిరస్కరింపజేసి ఉండొచ్చు. కానీ అలాంటిదేమీ చేయలేదు.

ఇతర అభ్యంతరకర అంశాల్లోనూ మోడీ సర్కారు జగన్ ప్రభుత్వాన్ని మందలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పరోక్షంగా జగన్‌కు మోడీ అండ్ కో సహకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటే. ఇలాంటపుడు పవన్ వారితో పొత్తు పెట్టుకుని ఏం లాభం? ఇలాంటి సహకారంతో అతను జగన్ సర్కారుపై ఏం పోరాడతాడు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.