ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేయడంతో, ఒక్కసారిగా ఈక్వేషన్స్ మారాయి. తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైన మైలేజ్ వచ్చి పడింది. ఇలాంటి సందర్భాల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బాగా తెలుసు. అందుకే, మొత్తంగా టీడీపీ శ్రేణుల్ని చంద్రబాబు యాక్టివ్ చేయగలిగారు.. అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత.
మరోపక్క, పైకి బుకాయిస్తున్నా.. వైసీపీ శ్రేణుల్లోనూ ఆందోళన బయల్దేరింది. ఒక్క అరెస్ట్.. రాజకీయ సమీకరణాల్ని ఇంతలా మార్చేస్తుందా.? అని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. ‘అచ్చెన్నాయుడిని దొంగగా మనం చిత్రీకరిస్తున్నామంటే.. అంతకన్నా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న మన పరిస్థితి ఏంటి.?’ అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోందంటూ మీడియా సర్కిల్స్‌లో కథనాలు విన్పిస్తున్నాయి.
మరోపక్క తాజా రాజకీయ పరిణామాలపై జనసేన, బీజేపీ ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ‘అవినీతిని వెలికి తీయాల్సిందే..’ అంటూనే, ‘కక్ష పూరిత రాజకీయాలు సబబు కాదు’ అని అంటున్నాయి వైసీపీ, జనసేన.
ఇదిలా వుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గ్రౌండ్ లెవల్‌లో వివిధ పార్టీల నుంచి వస్తున్న ఆహ్వానాలపై స్పందించారు. ‘మనం బీజేపీతో కలిసి నడుస్తున్నాం.. ఎవరైనా మనతో కలిసి నడవాలనుకుంటే.. బీజేపీ కూడా ఆ కూటమిలో వుంటుందన్న విషయాన్ని వారికి తెలియజేయండి..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కానీ, అది జరిగే పని కాదు.
సో, ఇక్కడ మేటర్ క్లియర్.. జనసేన, ప్రస్తుతానికి బీజేపీని కాదని మరో పార్టీతో జతకట్టే పరిస్థితి లేదు. అయితే, ఇదే రైట్ టైమ్ .. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. సత్తా చాటడానికి. సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన తర్వాత, సొంత పార్టీ నుంచే వివిధ అంశాలపై విమర్శలు వచ్చిన దరిమిలా.. ఆ ‘వాక్యూమ్’ని జనసేన సద్వినియోగం చేసుకోవాల్సి వుంది.
అలా జరగాలంటే, జనసేనాని ముందుగా హైద్రాబాద్ నుంచి అమరావతికి వెళ్ళాలి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జనసేనాని ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో వున్నారట. అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన పవన్, పరిస్థితుల్ని బట్టి జనంలోకి వెళ్ళాలన్న తన ఆలోచనని కూడా పార్టీ ముఖ్య నేతల ముందుంచినట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ నుంచి జనంలోకి వెళ్తానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో.. జనసేనాని సైతం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేయాల్సి వుంది.