పవన్-మహేష్ మల్టీస్టారర్.. ఆ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్

చాలా ఏళ్ల కిందటే ఓ ప్రముఖ పత్రిక సినిమా పేజీలో ఒక వార్త వచ్చింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. అప్పటికే వాళ్లిద్దరూ సూపర్ స్టార్ స్టేటస్ సంపాదించారు. వీళ్ల కలయికలో సినిమా అంటూ హెడ్డింగ్ చూడగానే చాలామంది ఎగ్జైట్ అయిపోయారు.

ఈ ప్రాజెక్టు గురించి విశేషాల్ని ఆసక్తిగా చదువుకుంటూ వెళ్తే చివరికి వచ్చేసరికి ఉస్సూరుమనిపించారు. ఏప్రిల్ ఫూల్ అనేసి.. ఆ రోజు ఏప్రిల్ 1 అనే విషయాన్ని గుర్తు చేశారు. వాళ్లకది తమాషాగా అనిపించి ఉండొచ్చు కానీ.. ఆ వార్త చదివి మండిపోయిన పాఠకులెందరో. ఎందుకంటే ఈ డ్రీమ్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని కోట్లమందికి ఆశ ఉంది. ఐతే ఇప్పటిదాకా వీళ్ల కలయికలో సినిమా చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదు.

పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ రూపంలో ఒక మల్టీస్టారర్ చేశాడు. మహేష్ కూడా ఇలాగే వెంకీతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేశాడు కానీ.. తన ఇమేజ్‌కు సమానంగా ఉన్న హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మహేష్ ఓ కీలక పాత్ర చేస్తాడని వార్తలొచ్చాయి కానీ.. తర్వాత అదేమీ లేదని తేలింది. ఐతే మహేష్, పవన్ కలయికలో సినిమా తీయాలని తాను సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.

‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే తన అభిరుచిని చాటుకున్నాడు రాహుల్. రెండో ప్రయత్నంగా తనది కాని కథతో ‘మన్మథుడు-2’ తీశాడు. అతడి బెడిసికొట్టింది. ప్రస్తుతం ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడి రెండు సినిమాలకు స్క్రిప్టులు రెడీ చేసుకున్నట్లు రాహుల్ వెల్లడించాడు.

అందులో ఒకటి ఓ తమిళ బిగ్ స్టార్‌తో ప్లాన్ చేస్తున్నానని.. ఇంకోటి ‘చి ల సౌ’ తరహాలో చిన్న ప్రాజెక్టని చెప్పాడు. తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి అడిగితే.. పవన్, మహేష్ కలయికలో సినిమా చేయాలనుందని.. వాళ్లను కొత్తగా చూపించే భిన్నమైన కథతో ఈ సినిమా చేయాలన్నది తన ఆశ అని.. వీళ్లను కలపడం చాలా కష్టమైనప్పటికీ ఆ కలయికలో సినిమా చేయాలనుందని రాహుల్ చెప్పాడు.