పవన్‌తో కిషన్‌రెడ్డి భేటీ: ‘నో’ జనసేన, ఓన్లీ బీజేపీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పూర్తి మద్దతు కోసం కిషన్‌రెడ్డి సహా బీజేపీకి చెందిన మరో సీనియర్‌ నేత లక్ష్మణ్‌, పవన్‌ కళ్యాణ్‌తో చర్చలు జరిపారు. చర్చల అనంతరం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా జనసైనికుల నుంచి ఒత్తిడి వచ్చిందనీ, అయితే విస్తృత ప్రయోజనాల నేపథ్యంలో మిత్రపక్షం భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామనీ, ఇప్పటికే నామినేషన్లు వేసిన జనసేన అభ్యర్థులు, తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని చెప్పారు.

‘క్యాడర్‌కి ఇది నిరుత్సాహం కలిగించే విషయమే. కానీ, భవిష్యత్తులో బీజేపీతో కలిసి మరిన్ని విజయాలు సాధించబోతున్నాం. ఈ నేపథ్యంలో జనసైనికులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకరించాలి. ఒక్క ఓటు కూడా చీలిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం..’ అని జనసేన అధినేత చెప్పారు.

జనసేనతో కలిసి తమ ప్రయాణం కొనసాగుతుందనీ, భవిష్యత్తులో బీజేపీ – జనసేన కలిసి బలమైన రాజకీయ శక్తిగా ముందడుగు వేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

కాగా, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ విషయమై జనసేన – బీజేపీ మధ్య తొలుత కొంత గందరగోళం నెలకొంది. జనసేనతో చర్చించేందుకు బీజేపీ నేతలు ఇటీవల ముహార్తం ఖరారు చేసుకోగా, ఆ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. అయితే, పొత్తుల చర్చలు ఇంకా జరగలేదని, జనసేన నుంచి ప్రతిపాదనలు ఏమీ లేవని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పడంతో ఆ గందరగోళం పెరిగింది.

ఈ నేపథ్యంలో జనసేన వర్గాల్లోనూ కొంత ఆందోళన కన్పించింది. అయితే, కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని, జనసేన అధినేతతో చర్చలు జరపడంతో గందరగోళానికి తెరపడింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేసి, తమ ఉనికిని చాటుకోవాలనుకున్న గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోని కొందరు జనసేన నేతలు మాత్రం, పవన్‌ తాజా నిర్ణయంతో కొంత డీలాపడ్డారు.

ఏదిఏమైనా, పోటీ విషయమై జనసేనాని తొందరపడ్డారన్నది నిర్వివాదాంశం. మిత్రపక్షంగా బీజేపీని భావిస్తున్నప్పడు, ఆ పార్టీతో ముందుగానే చర్చించి వుండాల్సింది. లేనిపోని ఆశల్ని అటు క్యాడర్, ఇటు అభిమానులు పెంచేసుకుని.. ఇప్పుడిలా చావు కబురు చల్లగా వినాల్సి వచ్చేసరికి తీవ్రంగా నిరుత్సాహపడుతున్నారు అటు అభిమానులు, ఇటు జనసైనికులు.. ఇంకోపక్క ఆశావహులు.