‘రెండు చోట్లా ఓడిపోయిన జనసేన పార్టీ అధినేత గురించి ఏం మాట్లాడతాం.?’ అంటూ టీఆర్‌ఎస్ నేత సుమన్, వెటకారాలు గట్టిగానే చేసేశారుగానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, కవిత.. నిజామాబాద్‌లో ఓడిపోయిన విషయాన్ని మర్చిపోతే ఎలా.? తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలో వున్నప్పుడే కేసీఆర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికనీ టీఆర్‌ఎస్ గెలవలేకపోయింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.
అప్పటికి వున్న రాజకీయ సమీకరణాలు సహా, చాలా అంశాలు గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయి. అధికారంలో వుండీ.. అడ్డగోలుగా ఖర్చు చేసినా టీఆర్‌ఎస్ అటు నిజామాబాద్‌లోనూ, ఇటు దుబ్బాకలోనూ గెలవలేకపోయింది. ‘ఎన్నికల్లో మేం డబ్బు పంచేది లేదు..’ అని ఖరాఖండీగా చెప్పి మరీ ధైర్యంగా ఎన్నికల్ని ఫేస్ చేసింది జనసేన పార్టీ. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ జనసేన ఒకే నినాదంతో పోటీ చేసింది. గెలవడం, గెలవకపోవడం.. అన్నది వేరే చర్చ. క్లీన్ పాలిటిక్స్ దిశగా జనసేన అధినేత ఓ ప్రయత్నమైతే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కలిసొచ్చేదెవరు.? కక్కుర్తి రాజకీయాలు చేసేది ఎవరు.? అన్నది ప్రజలే డిసైడ్ చేస్తారనుకోండి.. అది వేరే విషయం. ఇక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనుకున్నా, బీజేపీ సూచనతో పోటీ విరమించుకోవాల్సి వచ్చింది.. బీజేపీకి సహకరించాల్సి వస్తోంది.
అయితే, ఇంతవరకు జనసేన ఎక్కడా టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయలేదు గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలకు సంబంధించి. కానీ, ఈలోగా టీఆర్‌ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నిజమే.. జనసేనాని రెండు చోట్లా ఓడిపోయారు. కానీ, అలా రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌ని చూసి తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ భయపడటమేంటి.? అంటే, జనసేనాని బలమేంటో.. టీఆర్‌ఎస్‌కి ఖచ్చితమైన ఐడియా వుందన్నమాట. రాజకీయాల్ని పక్కన పెడితే, హైదరాబాద్ లో ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో కోటి రూపాయల విరాళాన్ని జనసేనాని ప్రకటించారు.. టీఆర్ఎస్ నేతలెవరైనా ఇంతలా సొంత డబ్బుల్ని వరద బాధితుల కోసం వెచ్చించారా.?