మంత్రి పదవి నిలబెట్టుకోవడం కోసం ‘వకీల్ సాబ్’ సినిమాపై ఏడుపా.?

టిక్కెట్ ధరల వ్యవహారం, థియేటర్లలో బెనిఫిట్ షోల వివాదం సంగతి పక్కన పెడితే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తోంది. ఇందుకోసం మంత్రులు మీడియా ముందుకొస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ‘వకీల్ సాబ్’ సినిమా గురించి మాట్లాడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ సినిమా హాట్ టాపిక్ అవడం.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ‘వకీల్ సాబ్’ సినిమా గురించి మాట్లాడుకుంటుండడం, నిత్యం మీడియాలో ‘వకీల్ సాబ్’ గురించి పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుండడం.. ఈ సినిమాకి వసూళ్ళ పంట పండిస్తోంది.

తాజాగా ఓ మంత్రిగారు మీడియా ముందకొచ్చి ‘వకీల్ సాబ్’ సినిమాని పాచిపోయిన సినిమాగా అభివర్ణించారు. బహుశా ఆయన ఆ సినిమాని తిలకించే వుంటారు. వైసీపీలో చాలామంది ఇప్పటికే సినిమా చూసేశారేమో. నిజానికి, బెనిఫిట్ షోలు సరిగ్గా పడకపోయినా, మొదటి రోజు మొదటి ఆట.. పవన్ కళ్యాణ్ అభిమానుల కంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఎక్కువగా చూసేసినట్టున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ‘వకీల్ సాబ్’ సినిమాలకి వన్ వర్డ్ రివ్యూలు మాత్రమే కాదు, పూర్తి విశ్లేషణ కూడా చేసేస్తున్నారు.

తాజాగా మంత్రి పేర్ని నాని, ‘వకీల్ సాబ్’ సినిమా గురించి మాట్లాడుతూ, హిందీలో అమితాబ్ చేసిన సినిమా.. తమిళంలోకి అజిత్ హీరోగా రీమేక్ అయ్యిందనీ.. అలా పాచిపోయిన సినిమాని తెలుగలోకి ‘వకీల్ సాబ్’గా తీసుకొచ్చారనీ సెలవిచ్చారు. సరే, సినిమాలో కంటెంట్ ఏంటి.? అన్నది వేరే చర్చ. పవన్ కళ్యాణ్ సినిమాకి.. ఓ మంత్రిగారు రివ్యూ ఇవ్వడమంటే అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకేముంటుంది.? రాష్ట్రంలో పాలన చేతకాక అప్పులు చేస్తున్న ప్రభుత్వం సంగతి మంత్రిగారు చూసుకుంటే మంచిదేమోనన్న విమర్శలు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి.

అయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భజనలో మునిగి తేలాల్సిన వైసీపీ నేతలు, ‘వకీల్ సాబ్’ భజనలో తరిస్తున్నారెందుకో.? ఇదేమన్నా వైసీపీకి వెన్నుపోటు పొడిచే వ్యవహారమని అనుకోవాలా.? ఇదిలా వుంటే, ‘మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కరోనా వ్యాక్సిన్‌తోపాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రాబిస్ వ్యాక్సిన్ టు మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునేవారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ..’ అంటూ జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

కేవలం మంత్రి పదవి నిలబెట్టుకునేందుకే మంత్రి పేర్ని నాని, అర్థం పర్థం లేకుండా ‘వకీల్ సాబ్’ సినిమా మీద పడి ఏడుస్తున్నారంటూ వినిపిస్తున్న ఆరోపణల్లో నిజమెంత.?