తమిళనాడు రాజకీయాల్లోకి దశాబ్దాలుగా జాతీయపార్టీలు ఏవీ కూడా కాలు పెట్టలేకపోయాయి. కాకలు తీరిన రాజకీయ యోధులు, ద్రవిడ పార్టీలు, స్థానికత, భాషపై ప్రేమ.. మిగిలిన వారిని ఎవరినీ దరి చేరలేక పోవటానికి కారణం. కానీ.. ఇప్పుడు బీజేపీ దానిని సుసాధ్యం చేయాలని భావిస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో చూపిన ప్రతాపం అక్కడ చూపిస్తే కుదరదని తాజా పరిణామం మరోసారి తెలియజేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేతో స్నేహం ఉన్న బీజేపీ ఆ పార్టీని కంట్రోల్ లోకి తీసుకోవాలని భావించింది.
ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ నిర్ణయిస్తుందని బీజేపీ తమిళనాడు చీఫ్ మురుగన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్నాడీఎంకే భగ్గున లేచింది. దీంతో మురుగన్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ సైతం పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై మాట్లాడటానికి నిరాకరించారు. తమను డిక్టేట్ చేయాలనుకుంటే కుదరదని తేల్చి చెప్పారు ఆ పార్టీ నాయకులు. వచ్చే ఎన్నికల్లో పళనిస్వామే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని తేల్చి చెప్పారు. మమ్మల్ని డిక్టేట్ చేస్తే కూటమే అవసరం లేదని అంటున్నారు.