తాజా వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్వయంగా మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రభుత్వానికి మధ్య సత్సంబధాలే ఉన్నాయి. అందుకనే పార్లమెంటులో బిల్లులను పాస్ చేయించుకునే విషయంలో మోడి అమిత్ షా లు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. జగన్ కూడా వారికి అన్నీరకాలుగా సహకారం అందిస్తునే ఉన్నారు.
మరి రెండు ప్రభుత్వాల మధ్య మంచి అవగాహన ఉన్నపుడు హఠాత్తుగా మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్ధమేంటి ? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలను చేయాల్సొచ్చింది ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అసలు కారణాలు వేరే ఉన్నాయట. అదేమిటంటే కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం సహకారం ఇస్తోంది కాబట్టి రాష్ట్రప్రయోజనాలను కేంద్రం కాపాడుతుందని జగన్ అనుకున్నారట.
అయితే చంద్రబాబునాయుడు ఉన్నపుడు రాష్ట్రం విషయంలో నరేంద్రమోడి ఎలా వ్యవహరించారో ఇపుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారట. పోలవరం నిధులు వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఎలాగూ పోయింది. చివరకు విశాఖ స్టీల్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కూడా ఆగటంలేదు. ప్రైవేటీకరణను ఆపమని జగన్ వ్యక్తిగతంగా మోడి అమిత్ షా ను కలిసినపుడు కోరినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇవికాకుండా ఆర్ధికంగా కూడా రాష్ట్రానికి కేంద్రం పెద్దగా దన్నుగా నిలవటంలేదు.
సరే ఈ విషయాలను పక్కనపెట్టేసినా తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలని ఏడాదిగా కోరుతున్నా మోడి పట్టించుకోవటంలేదు. అంటే కేంద్రానికి సహకారం అందిస్తున్న జగన్ను ప్రధానమంత్రి ఏరకంగా కూడా లెక్కచేయటంలేదట. దాంతో కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలను సమీక్షించుకున్న జగన్ ఇకనుండి అఫెన్సు మోడ్ లో వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల్లో వైసీపీ ఎంపీలు నానా గోల చేస్తున్నారు.
దానికి కొనసాగంపుగానే హఠాత్తుగా పేర్నినాని చేసిన వ్యాఖ్యలున్నాయి. అంటే బీజేపీతో వైసీపీ హనీమూన్ దాదాపు ముగింపుకొచ్చిందనే పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి అఫెన్సివ్ మోడ్ ప్రకటనల వరకేనా లేకపోతే పార్లమెంటులో బిల్లులను పాస్ చేసే విషయంలో కూడా కంటిన్యు అవుతుందా అన్నది చూడాలి. బిల్లులకు సహకరిస్తు బయట మాత్రం గోల చేస్తుంటే వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న విషయం జనాలు గ్రహించకుండానే ఉంటారా ?