ఏడాదికోసారి ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ, ఏప్రిల్ 1న చిన్నపిల్లలు చేసే హడావిడి చాలామందికి గుర్తుండే వుంటుంది. ఆ రోజున పెద్దోళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోతుంటారు. చాన్నాళ్ళ క్రితం క్రికెట్ వరల్డ్ కప్ విషయమై పెద్ద స్టోరీ రాసి.. చివర్న ఏప్రిల్ ఫూల్.. అని తేల్చేశారు.
అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏప్రిల్ ఫూల్ అనే విషయాన్నే అంతా మర్చిపోయారు. కారణం, ప్రతిరోజూ ప్రజలు ‘ఫూల్స్’ అవుతూనే వున్నారు. అధికారంలో వున్నోళ్ళు ప్రతిరోజూ కొత్త కథలు చెబుతూనే వున్నారు.. జనాన్ని పన్నుల పేరుతో బాదేస్తూనే వున్నారు.
బీజేపీ చాన్నాళ్ళ క్రితం ‘అచ్చేదిన్’ అంటూ ఓ క్యాంపెయిన్ షురూ చేసింది. అధికారంలోకి వచ్చేందుకోసం ఈ ప్రచారం జరిగింది. బీజేపీ గనుక అధికారంలోకి వస్తే, విదేశాల్లో మగ్గుతోన్న నల్లధనాన్ని తీసుకొస్తామనీ, తద్వారా ఇంటికి 15 లక్షలు చొప్పున ఇచ్చేందుకు ఆస్కారం దొరుకుతుందని బీజేపీ ప్రకటించింది.
ఆనాటి ఆ మాట అచ్చేదిన్.. ఇప్పటికీ నిజమవలేదు. అసలు నిజమవదు కూడా. ఇంటికి పదిహేను లక్షలు ఇచ్చే అవకాశం వున్నాగానీ, ప్రభుత్వాలు అలాంటి పని చెయ్యనే చెయ్యవు. ఎందుకంటే, పన్నుల పేరుతో జనాల ముక్కు పిండి వసూలు చేయడానికి ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి.
ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యడం.. ఈ క్రమంలో రాష్ట్రాల్ని, దేశాన్ని అప్పుల పాలు చేసెయ్యడం.. కొందరు బడా బాబుల్ని విదేశాలకు జాగ్రత్తగా పంపేసి, బ్యాంకుల్ని ముంచేయడం.. ఇదీ అధికారంలో వున్నోళ్ళు చేసే పని.
పెట్రోల్ ధర సెంచరీ దాటుతుందని కలలో అయినా అనుకున్నామా.? వంట గ్యాస్ ధర వెయ్యి రూపాయలవుతుందని కలగన్నామా.? అవన్నీ అయ్యాయ్. పన్నులు కడుతున్నాం, కడుతూనే వున్నాం. ప్రతినెలా ఒకటో తారీఖు వస్తోందంటే.. చాలా చాలా మారిపోతున్నాయి. కొత్త వాతలు షురూ అవుతున్నాయ్.
నరేంద్ర మోడీ మీద సెటైర్ల కోసం ‘మా బ్యాంకు అకౌంట్‌లో 15 లక్షలు పడ్డాయ్.. అచ్చే దిన్ వచ్చేసింది.. థాంక్యూ మోడీజీ..’ అంటూ కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుననాయిగానీ.. ఏప్రిల్ 1 నాడు.. దేశ ప్రజలంతా కొత్తగా ఫూల్స్ అయ్యారన్న విషయాన్ని మర్చిపోతే ఎలా.?