కష్టాల్లో దేశ ప్రజానీకం.. మోడీ ‘మంచి మాట’ చెప్తారా.?

కరోనా దెబ్బకి దేశం విలవిల్లాడుతోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటున్నా, కరోనా వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుంచి దేశం, దేశ ప్రజానీకం ఎప్పటికి పూర్తిస్థాయిలో కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి. కొన్నాళ్ళ క్రితం మోడీ సర్కార్‌, ‘ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌’ అంటూ పెద్దయెత్తున ప్యాకేజీ ప్రకటించింది. అయితే, ‘నేతి బీరకాయలో నెయ్యి’ చందాన ఆ ప్యాకేజీ వుందనే విమర్శలు విన్పించాయి. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.

కాస్సేపట్లో ప్రధాని మోడీ, దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించనున్నారు. ఇంతకీ మోడీ ఏం చెప్పబోతున్నారు.? కరోనా వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుంచి దేశ ప్రజానీకాన్ని బయటపడేసే ‘ఉపశమన చర్య’ ఏమైనా ప్రకటిస్తారా.? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా నేపథ్యంలో ‘మారటోరియం’ ప్రకటించినా, ‘ఆ వాయింపు’ మాత్రం అలాగే వుంది. ఈ విషయమై తాము ఏమీ చేయలేమంటూ కేంద్రం ఇటీవల చేతులెత్తేసిన విషయం విదితమే.

బ్యాంకుల నుంచి వస్తున్న ‘వార్నింగ్‌ కాల్స్‌’తో చాలామంది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు.. కొందరు బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. దినసరి కూలీలకు ఉపాధి మార్గం కరవయ్యింది.. చిన్నా చితకా ఉద్యోగులు (ప్రైవేటు రంగంలో) బిక్కుబిక్కుమంటున్నారు.. వేతనాలు సకాలంలో అందక. ఆ రంగం, ఈ రంగం అన్న తేడాల్లేవ్‌.. అన్ని రంగాలూ కుదేలైపోయాయి. ఈ పరిస్థితుల్లో మోడీ ‘సందేశం’ ఎలా వుండబోతోంది.? ఇంటి ముందు ‘చప్పట్లు’ కొట్టండి.. దీపాలు వెలిగించండి.. అంటూ గతంలో చెప్పినట్టు ఈసారి కూడా అలాంటిదేమైనా చెప్పి చేతులెత్తేస్తారా.? దేశ ప్రజానీకం హర్షం వ్యక్తం చేసేలా.. విజయదశమికి ముందు అతి పెద్ద ఉపశమనం ప్రధాని నోట వస్తుందా.?

ఏమోగానీ, దేశం చరిత్రలో కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని చవిచూస్తోందన్నది నిర్వివాదాంశం. రాష్ట్రాలు సైతం, కేంద్రం అందించే సాయం కోసం ఎదురుచూస్తున్న ఈ పరిస్థితుల్లో.. ‘కేంద్రం దగ్గర కూడా డబ్బుల్లేవు..’ అని కేంద్రం బీభత్సమైన ‘బీద’ అరుపులు అరిచేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మోడీ ప్రకటన నుంచి ఏం ఆశించగలం.?