ప్రధాని మోదీ కీలక ప్రకటన.. భారతీయులందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తాం

aకరోనా వ్యాక్సిన్ కు సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దేశంలోని ప్రతి పౌరుడికి ఈ వ్యాక్షిన్ అందిస్తామని అన్నారు. వ్యాక్సిన్ అందించడం ద్వారా దేశ ప్రజలకు భద్రత, భరోసా ఇస్తామన్నారు. ప్రపంచం అంతటా వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్న విషయాన్ని ఆయన చెప్పారు. గురువారం ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు విషయాలు చెప్పుకొచ్చారు.

‘దేశంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా సరైన సమయంలో కఠిన చర్యలు తీసుకున్నాం. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్ద్య కార్మికుల వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి పూర్తిగా అన్ లాక్ లోకి వెళ్తున్నాం. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. తీవ్రత తగ్గలేదు. ఇప్పటికి దేశంలో 80 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇది చాలా కీలకమైన సమయం. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. పండగ వేళల్లో అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దు’ అని చెప్పుకొచ్చారు.

ప్రధాని చేసిన ఈ ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కరోనా వ్యక్సిన్ కోసం దాదాపు 50వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందని వార్తలు వస్తున్నాయి. వ్యాక్సిన్ అందించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసిందని కూడా తెలుస్తోంది. ప్రయోగాలు విజయవంతమైన వెంటనే వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం.