ప్రభాస్ ప్రెస్ మీట్ కు దూరంగా పూజా హెగ్డే..!

‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే మధ్య విభేదాలు వచ్చాయని గత కొన్ని నెలలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పూజా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని మార్చి 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మేకర్స్ శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ముంబైలో సక్సెస్ ఫుల్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను.. చెన్నైలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. ఈ రెండు ఈవెంట్స్ కు ప్రభాస్ తో పాటుగా పూజా హెగ్డే కూడా హాజరైంది. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అయితే ప్రమోషన్స్ లో వీరిద్దరి వ్యవహార శైలి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రభాస్ – పూజా పక్కపక్కనే ఉన్నా ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తుల్లా ప్రవర్తించడం వీరి మధ్య అంతా సవ్యంగా లేదనే పుకార్లకు ఊతం ఇచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో తెలుగు మీడియా కోసం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాధేశ్యామ్ హీరోయిన్ లేకపోవడం చర్చనీయాంశం అయింది.

ప్రభాస్ తో పాటుగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ – మ్యూజిక్ కంపోజర్లు జస్టిన్ ప్రభాకరన్ – ఎస్ఎస్ థమన్ మరియు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సహా పలువురు ‘రాధే శ్యామ్’ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ముంబై – చెన్నై ఈవెంట్స్ లో పాల్గొన్న పూజా దీనికి రాకపోవడానికి కారణం ఇంకా తెలియరాలేదు.

ఇకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణపై ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. మంచి మెలోడీ పాటలను అందించిన సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ కి.. బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన థమన్ కు ప్రభాస్ ధన్యవాదాలు తెలిపారు.

‘రాధేశ్యామ్’ లో పరమహంస పాత్రలో తన పెదనాన్న కృష్ణంరాజు కనిపిస్తారని.. ఇంతకుముందు గోపికృష్ణ బ్యానర్ లో ‘బిల్లా’ చిత్రంలో కలిసి నటించామని ప్రభాస్ అన్నారు. తన పెదనాన్నతో రెండు సీన్లలో స్క్రీన్ షేర్ చేసుకున్నానని.. ఆయనతో నటించడం అద్భుతమని పేర్కొన్నారు. ఈసారి హిట్ ఇవ్వాలని అనుకుంటున్నానని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

కాగా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాయి. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ చైనీస్ మరియు జపనీస్ భాషల్లో భారీ స్థాయిలో ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ విడుదల కానుంది.