అగ్రిమెంట్లు అయిపోయాయా నానా.

విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం టాలీవుడ్లో, తెలుగు ప్రేక్షకుల్లో  తీవ్ర చర్చనీయాంశమవుతున్న పేరు. ఇప్పటికే ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘పెళ్లిచూపులు’ లాంటి సినిమాలతో మంచి పేరే సంపాదించినప్పటికీ.. ‘అర్జున్ రెడ్డి’తో అతడికొచ్చిన ఫేమ్ అలాంటిలాంటిది కాదు. అర్జున్ రెడ్డి అనేవాడు నిజంగానే ఉన్నాడా అనిపించేంతగా ఆ పాత్రలో విజయ్ లీనమైపోయి నటించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తెలుగు సినీ చరిత్రలోనే బెస్ట్ క్యారెక్టర్లలో ఒకటి అనదగ్గ అర్జున్ రెడ్డి పాత్రతో విజయ్ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. కేవలం టీజర్, ట్రైలర్లతోనే విజయ్ యూత్‌లో పిచ్చ క్రేజ్ సంపాదించాడు. సినిమా విడుదల తర్వాత ఆ క్రేజ్ ఇంకెన్నో రెట్లు పెరిగింది. రాత్రికి రాత్రి అతను స్టార్ ఇమేజ్ సంపాదించేశాడు.

‘అర్జున్ రెడ్డి’ సాధించిన సక్సెస్, ఈ సినిమాతో విజయ్‌కు వచ్చిన పేరు చూశాక.. అతడితో ఆల్రెడీ కమిట్మెంట్లు చేసుకున్న వాళ్ల ఆనందానికి హద్దుల్లేవు. అల్లు అరవింద్ సహా ఐదారుగురు నిర్మాతలు ఆల్రెడీ విజయ్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఒకటి.. పరశురామ్ డైరెక్షన్లో ఒకటి.. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో ‘పెళ్లిచూపులు’ నిర్మాతలు చేసే సినిమా ఒకటి.. అశ్వినీదత్ కూతుళ్ల ప్రొడక్షన్లో ఒకటి.. ఇలా చాలానే కమిట్మెంట్లు ఉన్నాయి విజయ్‌కి.

మరి ఈ సినిమాలకు పారితోషకం విషయంలో ఆల్రెడీ అగ్రిమెంట్లు జరిగిపోయాయా లేదా అన్నది ఆసక్తికరం. ఎందుకంటే ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ రేంజే మారిపోయింది. యూత్‌లో అతడికి సూపర్ క్రేజ్ వచ్చింది. విజయ్‌కంటూ ఒక మార్కెట్ క్రియేటైంది. ‘అర్జున్ రెడ్డి’ స్థాయిలో కాకపోయినా.. అతడికంటూ ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఇందుకు తగ్గట్లే విజయ్‌కి రెమ్యూనరేషన్ కూడా పెంచాల్సి ఉంటుంది. మరి పాత ఒప్పందాల ప్రకారమే చెల్లింపులంటే కుదరదు. విజయ్ మారిన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు వాళ్లంతట వాళ్లు పారితోషకాలు పెంచుతారా లేక ఆల్రెడీ మాటలు అయిపోయాయి కదా.. అగ్రిమెంట్లు కుదిరాయి కదా అని అతడికి గండి కొడతారా అన్నది చూడాలి.