‘పవర్ స్టార్’ విషయంలో మెగా ఫార్ములా ఇదే!

పవర్ స్టార్ సినిమా రిలీజ్ కు ముందు ఎంత సెన్సేషన్ సృష్టించిందో.. రిలీజ్ తర్వాత అంత నాసిరకం అని తేలిపోయింది. ఒక రకంగా ఈ దెబ్బతో పవర్ స్టార్ హ్యాపీ, పవన్ ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ. ఎవరి చేతికీ మట్టి అంటకుండా జనమే పవర్ స్టార్ సినిమాని తిప్పికొట్టారు. ఇకపై దాని గురించి కామెంట్ చేసేవారు కూడా ఉండరు. పైగా రిలీజైన నిమిషాల వ్యవథిలోనే పైరసీ అవ్వడంతో వర్మకు పెద్దగా డబ్బులు కూడా రాలేదని తెలుస్తోంది.

ఇవన్నీ పక్కనపెడితే.. ఈ విషయం మెగా కాంపౌండ్ కి ముందే తెలుసనే విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ముందస్తు సమాచారం తెలియడమే మెగా మౌనానికి కారణమంటున్నారు. సినిమా నిడివి, అందులోని డైలాగ్స్.. అప్ టు డేట్ గా మెగా ఫ్యామిలీకి ముందే సమాచారం లీకైందని చెబుతున్నారు.

ఆర్జీవీ దగ్గర ఎంత నమ్మకమైన స్టాఫ్ ఉన్నా.. మెగా అండదండల కోసం అందులో ఇద్దరు లీకువీరులుగా అవతరించారు. సినిమా పేరిట తీసిన షార్ట్ ఫిలింలోని స్టఫ్, సబ్జెక్ట్ అంతా ముందుగానే తెలియడంతో.. దీనిపై అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదనే నిర్ణయానికి వచ్చింది మెగా ఫ్యామిలీ. ఈ విషయంలో చిరంజీవి నిర్ణయమే ఫైనల్ అయిందని చెబుతున్నారు. ఓ దశలో నాగబాబు కాస్త ఆవేశానికి గురైనా.. చిరు చెప్పడంతో వెనక్కు తగ్గారని భోగట్టా.

ఇక పవన్ కల్యాణ్ ఎలాగూ గతంలోనే ఆర్జీవీని కరివేపాకులా తీసిపారేసి మాట్లాడారు. ఇప్పుడాయనదంతా జాతీయ స్థాయి రాజకీయం (అనుకుంటుంటారు). అందుకే వర్మపై స్పందించడానికి అస్సలు ఇష్టపడలేదు పవన్. ఇటీవల పవన్ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో కూడా కనీసం కౌంటర్ ఇవ్వాలని పదే పదే జనసేన ఇన్ సైడ్ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చిందని, కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారని, మనం మాట్లాడితే అనవసర ప్రచారం కల్పించినట్టవుతుందని చెప్పారట. అందుకే పవన్ ఇంటర్వ్యూల్లో ఎక్కడా వర్మ ప్రస్తావన కానీ, సినిమాల ప్రస్తావన కానీ లేదు.

ఒక రకంగా ఈ స్ట్రాటజీతో మెగా ఫ్యామిలీ పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పాలి. గతంలో వంగవీటి సినిమా టైమ్ లో బెజవాడ వెళ్లి మరీ రచ్చ లేపాలనుకున్నాడు వర్మ. రంగా, నెహ్రూ ఫ్యామిలీల నుండి కొన్ని హెచ్చరికలొచ్చాయి, సినిమా విడుదల టైమ్ లో హడావిడి జరిగింది. కానీ సినిమాలో వాస్తవాల్ని చూపించే ధైర్యం వర్మ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా అంతే. ట్రైలర్ లో చూపించిందే, సినిమాలో సాగదీశాడు తప్ప ఎక్స్ ట్రా ఏమీ లేదు.

ఈమాత్రం దానికే జనసైనికులు పూర్తిగా ఇదైపోయి వారం రోజులుగా సోషల్ మీడియాలో హేట్ పోస్టింగ్ లు పెడుతూ కూర్చున్నారు, వారిని రెచ్చగొడుతూ వర్మ పబ్బం గడుపుకున్నాడు. ఇకనైనా ఆర్జీవీని అలా వదిలేయడం మేలు. అందరూ మెగా ఫార్ములాని పాటించడం మంచిది.