ఏ సినిమా ఒప్పుకోవడానికైనా ప్లాట్ లైన్ అనేది ముఖ్యమంటున్న ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ ను ఎంత మాత్రం రీజినల్ స్టార్ గా చూడడానికి లేదు. బాహుబలి 1 అండ్ 2, సాహో చిత్రాలతో ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సాహో సినిమా మన దగ్గర ఆడకపోయినా నార్త్ సర్క్యూట్ లో దుమ్ము దులిపేసింది. ఈ సినిమా అక్కడ దాదాపు 150 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. సాహో వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం ఒక పూర్తి స్థాయి లవ్ ఎంటర్టైనర్ ను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు షార్ట్ షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులకు అందించాలని నిర్మాతలు భావిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

ఇక ప్రభాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఏదైనా సినిమా ఒప్పుకోవడానికి ఏమేం చూస్తాడో తెలిపాడు. తన మాటల ప్రకారం సినిమాకు ప్లాట్ లైన్ అనేది అత్యంత ముఖ్యమైంది, అదే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని తెలిపాడు. కథ వినేటప్పుడు స్టోరీ మరియు నా పాత్రను తీర్చిదిద్దే విధానం గురించి కచ్చితంగా ఆలోచిస్తాను. అయితే ప్లాట్ లైన్ అనేది అత్యంత ముఖ్యమైంది. అదే ప్రేక్షకుడిని ఆకర్షిస్తుంది. నా గత చిత్రాలు హిట్ అయ్యాయంటే అది నా దర్శకుల వల్లే. ప్రతి చిన్న విషయంపై వారు పెట్టిన శ్రద్ధ వల్లే అద్భుతమైన విజయాలు సొంతమయ్యాయి.

ఇక బాలీవుడ్ కు టాలీవుడ్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసాడు ప్రభాస్. షూటింగ్ పరంగా టాలీవుడ్, బాలీవుడ్ కు ఎవరి అప్రోచ్ వారికి ఉంది. మొదట భాష తెలియకుండా షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించేది. కానీ అదొక అద్భుతమైన అనుభవం అని ముగించాడు ప్రభాస్.