మళ్లీ తెరపైకి ప్రదీప్.. లీగల్ యాక్షన్ కు రెడీ

యాంకర్ ప్రదీప్ పై ఈమధ్య కాలంలో కొన్ని వివాదాలు, ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి మరింత సున్నితమైన అంశంలో ప్రదీప్ పేరు తెరపైకొచ్చింది. తన ప్రమేయం లేకుండా తన పేరు తెరపైకి రావడంతో ప్రదీప్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశాడు.

“అత్యంత సున్నితమైన అంశంలో నా పేరు ఎలా వస్తుందని కూడా ఆలోచించడం లేదు కొంతమంది. ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం మరో వ్యక్తి జీవితం నాశనం చేసేస్తారా. నిజాలు తెలుసుకోకుండా ట్రోలింగ్ చేసేయడమేనా. మీరు పెడుతున్న మానసిక క్షోభకు నాకు గానీ, నా కుటుంబానికి కానీ ఏమైనా అయితే ఎవరిది బాధ్యత.”

తను వినోదం పంచడానికే వచ్చాను తప్ప వివాదాల కోసం రాలేదంటున్న ప్రదీప్… చేతనైతే సాయం చేస్తాను తప్ప ఎవ్వరికీ అన్యాయం చేయలేదన్నాడు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, చెబుతున్న ప్రదేశాలు, ఆ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఈ యాంకర్.

అంతేకాదు.. ఎవరైతే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్లపై లీగల్ గా చర్యలు తీసుకోబోతున్నానని కూడా స్పష్టంచేశాడు. నిజాలు బయటకొచ్చేంత వరకు న్యాయపోరాటం, ఒంటరి పోరాటం చేస్తానని తెలిపిన ప్రదీప్.. తన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులెవ్వర్నీ వదిలిపెట్టనని అంటున్నాడు. సోషల్ మీడియా ట్రోలింగ్ పేరిట మానసికంగా తనపై అత్యాచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశాడు.

ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి ప్రదీప్ పేరు బయటకొచ్చింది. యువతిపై అత్యాచారం చేసిన వ్యక్తులు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ బయటకొచ్చింది. అందులో యాంకర్ ప్రదీప్ అనే పేరు కూడా ఉంది. దీనిపై సీరియస్ గా స్పందించిన ప్రదీప్.. లీగల్ గా ప్రొసీడ్ అవుతానని స్పష్టంచేశాడు.