`మా` ఎన్నికల పర్వం రసవత్తర మలుపులు తిరుగుతోంది. మునుపెన్నడూ లేనంతగా సాధారణ ఎన్నికలకు మించి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ వీధికెక్కుతున్నారు. బూతులు తిట్టుకుంటూ బాజారున పడుతున్నారు. ఈ ప్రహసనం కారణంగా `మా` పరువుని మరింతగా దిగజారుస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నెల 10న `మా` అసోసియేషన్ ఎన్నికలకు నగరా మోగడంతో ఈ విమర్శల పర్వానికి మరింత పదును పెట్టారు.
లైవ్ షోల్లో ఒకరిని మించి ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. ఓ విధంగా చూసే వారికి ఇవి `మా` ఎన్నికలా లేక సార్వత్రిక ఎన్నికల సమరమా? అనే భ్రమకలుగుతోంది. ఆ స్థాయిలో సభ్యుల మధ్య వాడీ వేడీ విమర్శల ప్రహసనం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నప్రకాష్రాజ్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.
తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ మంచు ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని కుటుంబాలకే పెత్తనం కావాలని మోహన్ బాబు అంటున్నారు. ఎన్టీఆర్ ఏ ఎన్నార్… చిరు కుటుంబాల్లో పుట్టకపోవడం నా తప్పా? .. మా సభ్యుడిగా పోటీ చేసు హక్కు నాకు లేదా? .. ఏపీ సీఎం జగన్ తన బంధువని మంచు విష్ణు చెబుతున్నాడు. కేటీఆర్ నాకు స్నేహితుడే .. అలా అని నేను చెప్పుకోవట్లేదు. కరోనా వేళ ఇండస్ట్రీకి చిరంజీవి ఎంతో చేశారు. మంచు కుటుంబం ఏం చేసింది? .. అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానల్ వార్ నడుస్తోంది. ఎవరికి వారు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈసారి పోరులో ఎవరు గెలుస్తారు? అన్నది తేలాల్సి ఉంది. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.