జస్ట్‌ ఆస్కింగ్‌: పవన్‌పై ప్రకాష్‌రాజ్‌కి ద్వేషమెందుకు.?


సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌, మరో సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ని ‘ఊసరవెల్లి’ అంటూ ఓ ఇంటర్వ్యూలో విమర్శించేశాడు. తానొక మేధావి అనే భావనలో వుంటాడు ప్రకాష్‌ రాజ్‌. సమాజం పట్ల తనకు బాధ్యత ఎక్కువ అని ఆయన భావిస్తుంటాడు. అది ఆయనిష్టం. అలాగని, ఇతరుల్ని నిందిస్తానంటే ఎలా.? రాజకీయాల్లో పొత్తుల్ని ‘ఊసరవెల్లి’తో ఎవరు పోల్చినా అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు.. ఆయా సందర్భాల్లో పొత్తులు పెట్టుకుంటాయి. నిన్న తిట్టిన పార్టీతో, రేపు పొత్తు పెట్టుకోవడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు.. ఇలా ఏ పార్టీ ట్రాక్‌ రికార్డ్‌ చూసినా చాలా చాలా పొత్తులు కనిపిస్తాయి. ఏదో పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించేయాలి కాబట్టి, అలా విమర్శించే విషయమై ఎవరి నుంచో కాంట్రాక్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి.. అన్నట్టుంది ప్రకాష్‌రాజ్‌ వ్యవహారం.

ప్రకాష్‌ రాజ్‌కి హక్కు వుంది, పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించడానికి.. విమర్శించేశాడు. అలాగే, తన తమ్ముడ్ని ఎవరన్నా విమర్శిస్తే నాగబాబు ఊరుకోరు గనుక.. నాగబాబు, ప్రకాష్‌ రాజ్‌ మీద కూడా విమర్శలు చేశారు. అంతే, ప్రకాష్‌ రాజ్‌కి ‘భాష’, ‘దేశం మీద ప్రేమ’ గుర్తుకొచ్చేశాయి. ‘మీ తమ్ముడి మీద మీకు ప్రేమ వుంది’, ‘నాకు దేశం మీద ప్రేమ వుంది’ అని అర్థం పర్థం లేని చర్చను తెరపైకి తెచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌కి దేశం మీద వున్న ప్రేమ ఎంతో ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమంలో అయినా, పార్టీ జెండాలతో సమానంగా, జాతీయ జెండాలు కనిపిస్తాయా.? జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రమే ఓ చేత్తో పార్టీ జెండా, ఇంకో చేత్తో జాతీయ జెండా పట్టుకుంటారు. వరదలు సంభవించినప్పుడు, కరోనా కష్ట కాలం వచ్చినప్పుడూ.. ఇలా ఏ సందర్భమొచ్చినా, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ దేశం మీద ప్రేమని చాటుకుంటూనే వున్నారు.

సైనిక సంక్షేమం కోసం జనసేనాని ఇచ్చిన విరాళాన్ని ఏమనాలి.? ఇవేవీ ప్రకాష్‌ రాజ్‌ కంటికి కనిపించలేదు.. కేవలం రాజకీయ పొత్తుల నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌, ప్రకాష్‌ రాజ్‌కి ఊసరవెల్లిలా కనిపించేశారా.? పైగా, ‘భాష’ గురించి ప్రస్తావించడం తన ట్వీట్‌లో నాగబాబుని వెటకారం చేస్తూ. ఎవరి మెప్పు కోసం ప్రకాష్‌ రాజ్‌ ఈ ప్రయత్నం చేశారోగానీ, ఈ పేరుతో ఆయన కోరుకున్న పబ్లిసిటీ అయితే వచ్చింది. అదే సమయంలో.. ఇచ్చిన టాస్క్‌ పూర్తి చేసిన ప్రకాష్‌ రాజ్‌కి పవన్‌ ప్రత్యర్థుల నుంచి ‘మెప్పు’ కూడా బాగానే లభిస్తున్నట్టుంది. అయితే మాత్రం, ఇంత ద్వేషమా.? ఇదే రాజకీయమా.? జస్ట్‌ ఆస్కింగ్‌.!