పక్కా స్కెచ్ వేసి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు!

త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ ప‌ద‌వికి ప్ర‌ముఖ సినీ న‌టుడు పృథ్వీరాజ్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఛానల్ ఉద్యోగినితో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడార‌ని ఆరోప‌ణ‌లున్న ఆడియో క్లిప్ వైరల్ కావడంతో స్వ‌చ్ఛందంగా త‌న ప‌ద‌వికి రిజైన్ చేశారు. త‌న‌ను ఈ వ్య‌వ‌హార‌లో కావాల‌ని ఇరికించార‌ని పృథ్వీ గ‌తంలో వాపోయారు. ఈ వ్య‌వ‌హారంపై విచారణ జరిపేందుకు టీటీడీ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలో కొంత‌కాలంగా మీడియాకు దూరంగా ఉంటోన్న పృథ్వీ తాజాగా తిరుమ‌ల వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌కు విచ్చేసిన పృథ్వీ ఆ ఆరోప‌ణ‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆ ఆరోప‌ణ‌లు త‌న‌ను మాన‌సికంగా ఇబ్బందికి గురిచేశాయ‌ని, చేయ‌ని త‌ప్పుకు తాను మాన‌సిక క్షోభ అనుభ‌వించాన‌ని పృథ్వీ అన్నారు. ఎస్వీబీసీని  ప్రక్షాళన చేసేందుకు తాను చేసిన ప్ర‌య‌త్నాల వ‌ల్లే త‌న‌ను కొంద‌రు ఇరింకించార‌ని అన్నారు. త‌న‌ను బ‌య‌ట‌కు పంపి కొద‌రు పైశాచికానందం పొందార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంద‌రు ఎస్వీబీసీ ఉద్యోగులు త‌న‌ను వెన్నుపోటు పొడిచారని, నిప్పులాంటి నిజాలు దాగ‌వ‌ని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అమలు చేస్తానన్నందుకే త‌న‌పై కుట్ర పన్నారని ఆరోపించారు. రైతులను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. కుట్రపూరితంగా తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తుదిశ్వాస విడిచే వ‌ర‌కు వైసీపీలో ఉంటాన‌ని, సీఎం జ‌గ‌న్ వెంట న‌డుస్తాన‌ని పృథ్వీ ఎమోష‌న‌ల్ అయ్యారు. వెంక‌న్న ద‌య త‌న‌పై ఉంటే మ‌రోసారి ఎస్వీబీసీ ఛైర్మన్‌ అవుతానంటూ పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న పృథ్వీ మునుప‌టిలా హుషారుగా కాకుండా ముభావంగా ఉన్నారు. చేతికి కట్టు కట్టుకుని తీరుమల వ‌చ్చిన పృథ్వీ మీడియాతో ముక్త‌స‌రిగా మాట్లాడారు. కాగా, ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని ఎవ‌రికి ఇస్తార‌నే విష‌యంపై చాలా పేర్లు వినిపించారు. అయితే, చైర్మన్ పదవిని పక్కన పెట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎండీ పదవిని తెరపైకి తేవ‌డంతో ఆ ఊహాగానాల‌కు తెర‌పడింది. ఎస్వీబీసీ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించారు. గతంలో ఎస్వీబీసీ బోర్డు ఏర్పాటైన తర్వాత ఎండీ పోస్టులో టీటీడీ ఈవోనే ఉండేవారు. అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రభుత్వం నియమించిన చైర్మన్‌కే ఎండీ బాధ్యతలనూ అప్పగిస్తున్నారు. తాజాగా పృథ్వీపై వ‌చ్చిన ఆరోప‌ణ నేప‌థ్యంలో చైర్మ‌న్ ప‌ద‌వి సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉంది.