‘‘తెలుగు, తమిళం, మలయాళం, హిందీ… ఇలా పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక యాక్టర్‌గా నన్ను నేను నిరూపించుకునేందుకు మరింత ఆస్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఆ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అంటున్నారు రాశీ ఖన్నా. 2014లో ‘ఊహలు గుసగుసలాడె’ చిత్రంతో కథా నాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారీ బ్యూటీ. 2017లో ‘విలన్’ సినిమా ద్వారా మలయాళంలోకి అడుగుపెట్టారు. తాజాగా ‘భ్రమమ్’ అనే మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ– ‘‘మిగతా భాషల సినిమాలతో పోల్చినప్పుడు మలయాళ సినిమాలు కొంచెం భిన్నంగా ఉంటాయని నా ఫీలింగ్. తెలుగు సినిమాల కోసం తెలుగు నేర్చుకున్నాను. ఆ తర్వాత తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టడంతో ఆ భాష నేర్చుకున్నాను. ఇప్పుడు మలయాళం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు టంగ్ ట్విస్టర్‌లా అనిపిస్తోంది. మలయాళ పదాలు పలకడం కొంచెం కష్టమే. అయినా నేర్చుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.