తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ తనయ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆమె విలన్ పాత్రలకు ఓకే చెప్పడం.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వరుస సినిమాలను చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ మీడియా సర్కిల్స్ వారు మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సమయంలో మరోసారి వరలక్ష్మి శరత్ కుమార్ జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పుట్టి పెరిగిన చెన్నై నగరాన్ని వీడినట్లుగా ప్రకటించింది. ఇక ముందు నుండి తన పూర్తి జీవితంను హైదరాబాద్ లోనే కొనసాగిస్తాను అంటూ ప్రకటించింది. ఇటీవలే హైదరాబాద్ షిప్ట్ అయినట్లుగా ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా అధికారికంగా ప్రకటించడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.
తెలుగు సినిమాల్లో నటించడం కోసం అయితే చెన్నై నుండి హైదరాబాద్ రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఒక వేళ పెద్ద సినిమాలు.. లాంగ్ షెడ్యూల్స్ ఉంటే నెల రెండు నెలలు ఉండి వెళ్లవచ్చు. కాని పూర్తి గా హైదరాబాద్ లోనే ఉండబోతున్నట్లుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కాస్త అనుమానంగా.. చర్చనీయాంశంగా ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలకు కారణం అవుతున్నాయి.
చెన్నై లో వరలక్ష్మి కి ఎంతో మంది స్నేహితులు.. సన్నిహితులు కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాంటి చెన్నై నగరాన్ని ఎలా వీడుతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నా కూడా తండ్రితో మరియు తండ్రి భార్య తో కూడా వరలక్ష్మికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విభేదాలు ఏమీ లేకుండానే ఎందుకు అక్కడ నుండి రావాల్సి వచ్చిందంటూ తెలుగు జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
తెలుగు మరియు తమిళ సినిమాలను వరుసగా చేస్తున్న వరలక్ష్మి ఇక నుండి తమిళ సినిమాల షూటింగ్ కోసం చెన్నై వెళ్లి వస్తూ ఉంటుందట. ప్రస్తుతానికి హైదరాబాద్ లోని ఒక ఖరీదైన ఏరియాలో అపార్ట్మెంట్ లో ప్లాట్ ను తీసుకున్న వరలక్ష్మి త్వరలోనే ఒక ఇండిపెండెంట్ ఇల్లును కూడా తీసుకునే ఆలోచన చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
హైదరాబాద్ అందాలు నచ్చి.. ఇక్కడ పద్దతులు నచ్చి ఆమె వచ్చి ఉంటుందా లేదంటే అక్కడ ఏమైనా సమస్య వరలక్ష్మిని వేదించిందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా వరలక్ష్మి హైదరాబాద్ షిప్ట్ అవ్వడం తో తెలుగు లో ఈమె మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి.