రఘురామ డిశ్చార్జి.. నేరుగా ఎయిమ్స్ కు..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ.. అక్కడ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లి.. తదుపరి చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ లోని స్వగృహంలో అరెస్టు చేసి గుంటూరు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ ఎంపీ ఫిర్యాదు చేయడంతో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది.

రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు.. ఆయన్ను ఎవరూ కొట్టలేదని నివేదిక ఇచ్చింది. అయితే, రఘురామకు మరో ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతి మేరకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపీ కాలిపై గాయాలు నిజమేనని ఆర్మీ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్ లో చేరారు.