రఘురామకి అంత ధైర్యముంటే రాజీనామా చేసెయ్యొచ్చుగా.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, 2 లక్షల ఓట్ల తేడాతో తాను గెలిచే అవకాశం వుందని ధైర్యంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.? ఎటూ వైసీపీ నచ్చడంలేదాయె.. సొంత పార్టీకి రాజీనామా చేసేసి.. ఏదన్నా ఓ పార్టీని ఎంచుకునో, లేదంటే ఇండిపెండెంట్‌గానో ఉప ఎన్నికలకు వెళ్ళి సత్తా చాటేయొచ్చు కదా.! అన్నది చాలామంది డౌట్‌.

రాజకీయాల్లో నేతల మాటలేమో కోటలు దాటేస్తాయి.. చేతలేమో.. గడప కూడా దాటవ్‌. వైసీపీ, రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయదు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడదు. ఆయనేమో తనంతట తానుగా రాజీనామా చేయరు. ‘నువ్‌ రాజీనామా చెయ్‌.. ఈసారి దారుణంగా ఓడిస్తాం..’ అని సవాల్‌ విసురుతారు వైసీపీ నేతలు. ‘వైఎస్‌ జగన్‌ నా మీద పోటీ చేసినా 2 లక్షలతో ఓడించేస్తా..’ అంటారు రఘురామకృష్ణరాజు. ఈ సవాళ్ళ పరంపర ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో ఏమోగానీ, రాజుగారు ‘రచ్చబండ’ నిర్వహించిన ప్రతిసారీ నిగ్రహం కోల్పోతూనే వున్నారు.

‘స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవిని నా నుంచి లాక్కుని.. తన మతానికి చెందిన వ్యక్తికి వైఎస్‌ జగన్‌ ఇచ్చుకున్నారు..’ అంటూ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి కూడా జరుగుతాయా.? నిజానికి, గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేశారాయన. ఇప్పుడు ఇంకాస్త గట్టిగా చేస్తున్నారు. ఈ తరహా ఆరోపణలతో రఘురామకృష్ణరాజు తన స్థాయిని మరింత దిగజార్చేసుకుంటున్నారన్నది నిర్వివాదాంశం.

రోజులు గడుస్తున్నాయ్‌.. నెలలు గడుస్తున్నాయ్‌.. సొంత నియోజకవర్గం మొహం కూడా చూడటంలేదాయన. కేంద్ర బలగాల సెక్యూరిటీ తెచ్చుకున్నా, నర్సాపురం వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్న రఘురామకృష్ణరాజు తాటాకు చప్పుళ్ళు ఇంకెన్నాళ్ళో ఏమోగానీ.. మీడియాకి మాత్రం బోల్డంత స్టఫ్‌ దొరుకుతోంది.

అలాగని, మీడియానీ ఆయన వదిలిపెట్టడంలేదు. ఎవరన్నా ఎక్కడన్నా తనకు వ్యతిరేకంగా కామెంట్‌ చేస్తే చాలు.. వాళ్ళ మీదా విరుచుకుపడిపోతున్నారు. సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవిపైనా అసహనం వ్యక్తం చేశారు రఘురామ. ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే, రాజుగారి రచ్చబండ.. ముందు ముందు మరింత రొచ్చుబండగా మారిపోతుంది తప్ప.. ఆయనక్కూడా పెద్దగా ప్రయోజనం వుండకపోవచ్చు.