ఆ ఒక్క సీన్ కే కళ్లుతిరిగే ఖర్చయ్యేది: రాజమౌళి

తెలుగు తెరపై హాలీవుడ్ సినిమాలు చూసి ఆశ్చర్యపోయే ప్రేక్షకులు .. తెలుగు సినిమానే హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే దర్శకుడు వస్తాడని ఊహించలేదు. తెలుగు తెరపై అందమైన చందమామలా కదిలే కథకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కొత్త ప్రయోగాలు చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. కానీ ప్రపంచ పటంపై తెలుగు సినిమా జెండా ఎగరేసింది. దర్జాగా ఆ జెండాను ఎగరేసిన దర్శకుడే రాజమౌళి. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఆర్ ఆర్ ఆర్’ రెడీ అయింది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిమిత్తం ఈ సినిమా టీమ్ ‘దుబాయ్’ వెళ్లింది. హాలీవుడ్ సినిమాల్లోని టెక్నాలజీకీ .. ఇక్కడి టెక్నాలజీకి మధ్య గల తేడా ఏంటి? ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అనే ప్రశ్న అక్కడి ప్రెస్ మీట్ లో రాజమౌళికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. “నిజంగానే ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఇది ప్రెస్ మీట్ కనుక పూర్తిగా చెప్పడం కుదరదు .. లేదంటే సెపరేటుగా చెప్పుకునే క్లాస్ ఇది. ఫారిన్ లో టెక్నాలజీకి సంబంధించిన వింగ్ లో చాలా తక్కువమంది పని చేస్తారు .. చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తారు.

కానీ మన దగ్గర అలా ఉండదు .. ఒక చిన్న పనికి కూడా ఇక్కడ ఎక్కువమంది పని వాళ్లను తీసుకోవలసి వస్తుంది. ఎక్కువమందిని పెట్టుకోవడం వలన ఎక్కువ అవుట్ పుట్ .. తక్కువ మందిని తీసుకోవడం వలన తక్కువ అవుట్ పుట్ వస్తుందని చెప్పలేం. కొన్ని సార్లు ఎక్కువ మంది పని చేస్తున్నప్పటికీ అవుట్ పుట్ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఫారినర్స్ ఆలోచనా విధానం వేరు .. మన ఆలోచనా విధానం వేరు. వాళ్ల వర్కింగ్ స్టైల్ వేరు .. మన వర్కింగ్ స్టైల్ వేరు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. దానిని బట్టే అవుట్ పుట్ ఉంటుంది.

ఉదాహరణకి ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ కి ఎక్కువ యానిమల్స్ అవసరం .. ఎక్కువ ఎక్విప్మెంట్ అవసరం. అప్పుడు మేము అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ను ఉపయోగించాము. లోకల్ గా అందుబాటులో ఉన్న యానిమల్స్ ను వాడుకున్నాము. చిన్న చిన్న ట్రిక్స్ చేశాము. అలా చేస్తేనే ఆ సీన్ పై పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి వచ్చింది. ఇదే సీన్ ను ఫారిన్ ఎక్విప్మెంట్ తో తీయాలంటే మిలియన్స్ లో ఖర్చు అవుతుంది. టెక్నాలజీ పరంగా వాళ్ల స్టైల్లో చేయాలంటే ప్రస్తుతం మనం పెడుతున్న ఖర్చు కంటే పది రెట్లు ఎక్కువ పెట్టవలసి వస్తుంది” అని చెప్పుకొచ్చారు.