ఇంతకుముందులా లైన్ విని హీరోలు సినిమా ఓకే చేసేయడం.. బౌండెడ్ స్క్రిప్టు లేకుండా సినిమాను పట్టాలెక్కించేసేయడం టాలీవుడ్లో ఇప్పుడు జరగట్లేదు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి స్టార్లు అయితే ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు.
పూర్తి స్థాయి స్క్రిప్టు లేకుండా తెరకెక్కిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో మహేష్ చాలా స్ట్రిక్టుగా తయారయ్యాడు. స్క్రిప్టు ఓకే చేయకుండా సినిమా ఖరారు చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పేస్తున్నాడు. ఈ విషయంలో మొహమాటాలకు కూడా పోవట్లేదు.
అవతలున్నది అత్యంత సన్నిహితుడైనా చూడట్లేదు. వంశీ పైడిపల్లికి ఇలాగే షాక్ ఇచ్చాడు. మహర్షి తర్వాత అతడితో మంచి స్నేహం కుదిరినా సరే.. తర్వాతి సినిమాకు స్క్రిప్టు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే.
మిగతా దర్శకుల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్న మహేష్ బాబు.. రాజమౌళి విషయంలో మాత్రం రూల్స్ బ్రేక్ చేయబోతున్నాడు. రాజమౌళితో సినిమా చేయాలని మహేష్ ఎప్పట్నుంచో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అతడి కల ఫలించింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేష్ బాబుతోనే సినిమా చేస్తానని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌ను మహేష్ కాదనే అవకాశమే లేదు. ఈ సినిమాను సూపర్ స్టార్ ఓకే చేయడం లాంఛనమే. అయితే ఈ చిత్రానికి ఇప్పటిదాకా జక్కన్న కథంటూ ఏమీ అనుకోలేదు.
ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచన కూడా లేదు. మహేష్‌తో ఏమీ డిస్కస్ చేయలేదు. కానీ సినిఆ మాత్రం అనౌన్స్ చేశాడు. మహేష్ కూడా ఈ సినిమా చేయబోతున్నాడు. అంటే పూర్తి స్క్రిప్టు కాదు కదా.. కనీసం లైన్ కూడా తెలియకుండానే మహేష్ ఈ సినిమా ఓకే చేసి రూల్స్ బ్రేక్ చేశాడన్నమాట.