రాజమౌళీ.. పిండేశావ్ పోవయ్యా!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఇందుకు అచ్చమైన ఉదాహరణగా కనిపిస్తాడు దర్శక ధీరుడు రాజమౌళి. తన చుట్టూ ఉన్న వాళ్లతో.. తనతో సినిమా చేసే వాళ్లతో రాజమౌళి ఎలా ఉంటాడో ఏమో కానీ.. బయటెక్కడా కూడా ఇప్పటిదాకా అతను రవ్వంత అహంకారం.. అసహనం ప్రదర్శించింది లేదు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే మరే దర్శకుడికీ లేని సక్సెస్ స్ట్రీక్ అతడి సొంతం. ఇప్పటిదాకా అపజయమే ఎరుగకపోవడం మాత్రమే కాదు.. సినిమా సినిమాకూ తన సక్సెస్ రేంజ్ పెంచుకుంటూ ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి మెగా సక్సెస్ తో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నాడు జక్కన్న. అయినప్పటికీ విజయ గర్వం అతడి తలకెక్కకపోవడం గొప్ప విషయం.

ఎంతో సాధించినా ఎప్పుడూ ఇది నా క్రెడిట్టే అని గొప్పలు పోని రాజమౌళి.. తాజాగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన ప్రసంగంతో మరోసారి అందరి మనసులూ గెలిచాడు. సినిమా అలా తీశా.. ఇలా తీశా.. ఆ సీన్ ఇలా వచ్చింది అలా వచ్చింది అని కానీ.. తాను ఈ సినిమాకు అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా అని కానీ చెప్పుకోకుండా తెరవెనుక ఈ సినిమా కోసం కష్టపడ్డ వాళ్లందరి గురించి రాసుకుని వచ్చి మరీ పేరు పేరునా ప్రస్తావిస్తూ వారి గొప్పదనాన్ని చెప్పడం ద్వారా తన మీద జనాలకు మరింత ప్రేమ.. గౌరవం పెరిగేలా చేశాడు జక్కన్న.

సెట్లో టీలు.. టిఫిన్లు అందించే వాళ్ల దగ్గర్నుంచి పెయింటర్స్.. కొరియోగ్రాఫర్లు.. ఫైట్ మాస్టర్లు.. వీఎఫెక్స్ టీం.. గ్రాఫిక్స్ టీం.. కాస్ట్యూమ్స్ టీం.. అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఎడిటర్.. ఇలా ఎన్నో విభాగాలకు చెందిన తెర వెనుక శ్రామికుల్ని పరిచయం చేశాడు జక్కన్న. మామూలుగా వీళ్ల పేర్లన్నీ సినిమా పూర్తయ్యాక రోలింగ్ టైటిల్స్ లో కొట్టుకుపోతాయి. వీళ్ల గురించి ఎవ్వరూ వేదికల మీద మాట్లాడరు. కానీ రాజమౌళి మాత్రం అందరినీ పరిచయం చేస్తూ వాళ్ల ప్రత్యేకతల గురించి చెప్పి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు రాజమౌళి. ఇందుకు జక్కన్నకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.