కొన్నాళ్లుగా తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు హీరో రజినీకాంత్ తెర దించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు, జనవరిలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో చేసిన ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ పార్టీ వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని.. కొత్త పార్టీ కొత్త సంవత్సరంలో ఉంటుందని తెలిపారు. ‘ఇప్పుడు కాకపోతే మార్పు.. మరెప్పుడూ రాదు.. అంతా మారుస్తాం’ అని ట్విట్టర్ లో తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
‘నా రాజకీయ ప్రవేశంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నాకు తమిళనాడు ప్రజలే ముఖ్యం. రాష్ట్రం కోసం ఏదైనా చేస్తాను. తమిళ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను. ఈ వయసులో డాక్టర్లు వద్దని వారిస్తున్నా నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ప్రజల తలరాత మారుస్తా. ప్రజల మద్దతు ఉంటే అన్నింటినీ మారుస్తాను. వ్యవస్థలో మార్పు తీసుకొస్తాను. 2021 ఏప్రిల్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. సిద్ధం కండి. ప్రజాదరణతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాం. కులమతాలకు అతీతంగా నీతివంతమైన ఆధ్యాత్మిక రాజకీయాలు అందిస్తాం. రాజకీయాల్లో వచ్చే ముందు రాష్ట్రమంతా పర్యటించాలని భావించాను. కరోనా వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నాను’ అని అన్నారు.
రజినీకాంత్ ప్రకటనతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. రజినీ ఇంటి వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. తన రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో రజినీ చెప్తున్నారు. గతంలోనూ, రీసెంట్ గానూ అభిమాన సంఘాల నాయకులతో సమావేశం కూడా అయ్యారు. త్వరలో నిర్ణయం చెప్తానని అనడంతో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రజినీ పార్టీ పెడుతున్నానని ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రజినీ రాకతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మారతాయని అంటున్నారు.