రెండు మూడు సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని సినిమాలను చరణ్ రీమేక్ కాని సీక్వెల్ కాని చేస్తే బాగుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతూ చర్చ మొదలు పెట్టారు. ఆ చర్చ సుదీర్ఘకాలం సాగింది. ఆ చర్చలో భాగంగా గ్యాంగ్ లీడర్ మరియు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాల గురించి ప్రముఖ చర్చ జరిగింది. చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం సీక్వెల్ లేదా రీమేక్‌లో రామ్ చరణ్ మరియు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కలిసి నటించాలంటూ చాలా మంది కోరుకున్నారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీమేక్‌కు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే అవన్ని ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. గత కొన్నాళ్ల నుండి ఆ వార్తలు, ప్రచారం లేదు. అయితే ఎల్లుండితో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదల అయ్యి 30 ఏళ్లు కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆ చిత్ర నిర్మాత అశ్వినీదత్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
ఎప్పటికైనా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం సీక్వెల్ చేసిన తర్వాతే తాను సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటానంటూ ప్రకటించాడు. దాంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ ఆ విషయమై సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలు పెట్టారు. రామ్ చరణ్, జాన్వీకపూర్‌లతో మాత్రమే సీక్వెల్ తీయాలంటూ కొందరు డిమాండ్ కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులను రీప్లేస్ చేయగల సత్తా కేవలం చిరంజీవి, జాన్వీకపూర్‌లకు మాత్రమే ఉందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
అశ్వినీదత్ ఏ క్షణంలో అన్నాడో కాని అప్పటి నుండి సోషల్ మీడియాలో సీక్వెల్ విషయమై చర్చ మారు మ్రోగిపోతూనే ఉంది. అయితే ఇది ప్రారంభం అయ్యేందుకు అయిదు లేదా పదేళ్లు అయినా పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుండి ఇంత రచ్చ చర్చ అవసరం లేదని కొందరు అంటున్నారు.