చరణ్ మూవీ ‘జెర్సీ’ లా ఉండదట!

దసరా సందర్బంగా రామ్ చరణ్ హీరోగా జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు సిద్దం అయ్యారు. జెర్సీ సినిమాతో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరో జాతీయ అవార్డు సినిమాను చరణ్ తో తీస్తాడా ఏంటీ అంటూ అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అవార్డులు దక్కించుకున్న సినిమాలు కమర్షియల్ గా హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అవార్డులు దక్కించుకున్న సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అందుకే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ సినిమా అనగానే జెర్సీ వంటి ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అయ్యి ఉంటుందని.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించక పోవడం మంచిది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ తో గౌతమ్ తెరకెక్కించబోతున్న సినిమా జెర్సీ మాదిరిగా ఉండదు అంటున్నారు.

జెర్సీ సినిమా లో నానిని ఒక అద్బుతమైన నటుడిగా దర్శకుడు చూపించాడు. ఇప్పుడు హిందీ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. హిందీలో జెర్సీ విడుదలకు అంతా సిద్దం అయ్యింది. ఆ సందర్బంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తదుపరి సినిమా విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్ సినిమా గా ఉంటుందని అన్నాడట. మాస్ ఎంటర్ టైనర్ గా రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమా ఉంటుందని అంటున్నారు. రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబోలో ఇప్పటికే ప్రారంభం అయిన సినిమా ను వచ్చే ఏడాది ద్వితీయార్థంకు ముగించబోతున్నారు. చరణ్ ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అంటూ చాలా నెలలుగా వార్తలు వస్తున్నాయి. కాని చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బిజీగా ఉండటంతో పాటు శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాను కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ఉండక పోవచ్చు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో సినిమాను వచ్చే ఏడాది లో ప్రారంభించి సినిమా కు సంబంధించిన విడుదల తేదీని 2023 లో ప్లాన్ చేస్తారని సమాచారం అందుతోంది. 2023 లో శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాను విడుదల చేయబోతున్నారు.. అదే ఏడాదిలో ఈ సినిమాను కూడా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా దానయ్య నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చరణ్ చేయబోతున్న విషయం తెల్సిందే.