గురుస్వామిగా ప్రమోట్ అయిన చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్` సక్సెస్ తో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెప్పించిన చరణ్ ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. `ఆర్ ఆర్ ఆర్` లో తారక్ కంటే ఓ మెట్టుపైనే ఉన్నాడు. పాత్ర పరంగా పాన్ ఇండియా వ్యాప్తంగా కనెక్ట్ అవ్వడం చరణ్ కి కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు.

సూపర్ స్టార్ కృష్ణ..నట సార్వభౌమ ఎన్టీఆర్ లాంటి లెజెండరీ నటుల తర్వాత చిన్న వయసులోనే అల్లూరి పాత్రలో నటించే అరుదైన అవకాశం చరణ్ కి రావడం లక్కీ అని చెప్పాలి. అదీ వివిధ భాషల్లో ఆ పాత్ర పేరు తీసుకురావడం అన్నది కొన్నాళ్ల పాటు గుర్తిండిపోయే అంశం. చరణ్ ఇప్పుడు అదే మూవ్ మెంట్ ని ఆస్వాదిస్తున్నాడు.

సరిగ్గా సినిమా రిలీజ్ అయి 10 రోజులు గడుస్తుంది. వసూళ్ల పరంగా `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ నే షేక్ చేస్తుంది. దీంతో టీమ్ అంతా హ్యాపీ. ఇప్పుడా సంతోషాన్ని చరణ్ దేవుడితో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. చరణ్ సడెన్ గా ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారు. స్వామియే శరమయ్య అంటూ అయ్యప్ప సేవలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

నేడు ముంబై ప్రయివేట్ ఎయిర్ పోర్టులో చరణ్ అయ్యప్ప దుస్తుల్లో కనిపించారు. ముంబైలో ల్యాండ్ అవ్వగానే కారు దిగి నలుపు దుస్తుల్లో కనిపించారు. కాళ్లకి చెప్పులు లేకుండా నేలపై నడవడాన్ని గమనించవచ్చు. అలాగే చేతికి నలుపు రంగు వాచ్ ధరించారు. ఈ ఏడాదితో చరణ్ గురుస్వామి అయినట్లు తెలుస్తోంది.

భుజాన గురుస్వామి కండువా ధరించారు. దీంతో చరణ్ గురు స్వామిగా ప్రమోట్ అయినట్లు తెలుస్తోంది. చరణ్ ప్రతీ ఏడాది అయ్యప్ప మాల ధరిస్తుంటారు. 41 రోజుల పాటు భక్తి శ్రద్దలతో..నియమ నిష్టలతో ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. అలా అయ్యప్పతో చరణ్ కి ప్రత్యేకమైన బంధం ఏర్పడింది.

సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా…ఏడాదిలో 40 రోజులు అయ్యప్ప భక్తి కోసం కేటాయించడం విశేషం. ఈ అలవాటు చరణ్ కి తండ్రి చిరంజీవి నుంచి వచ్చిందని చెప్పాలి. చిరంజీవి కూడా వీలు కుదిరిప్పుడల్లా అయ్యప్ప మాల ధరిస్తారు. తండ్రి కారణంగానే చరణ్ కి అయ్యప్ప మాల ధరించడం అలవాటైంది. ఇక ఈ 40 రోజుల పాటు చరణ్ ఎలాంటి సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తి చేసారు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కారణంగా బ్రేక్ పడింది. తాజాగా చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి శంకర్ `ఇండియన్ 2` షూట్ బిజీ అయి ఉండొచ్చని తెలుస్తోంది.