మందుబాబులకు వర్మ నాయకత్వం

కరోనా వేళ రామ్ గోపాల్ వర్మ వేసిన సగటు 10 ట్వీట్లలో 8 మందు గురించే ఉంటున్నాయి. మందుబాబుల సంగతి పట్టించుకోండి, వైన్ షాపుల్ని తెరవండి.. అసలు కరోనాకీ ఆల్కహాల్ కీ లింకేంటి? అంటూ.. ప్రభుత్వాలకు హితబోధ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ వర్మ ప్రతిపాదనకు ఓ స్వీట్ రిటార్ట్ ఇచ్చి వైన్ షాపుల వ్యవహారాన్ని సెలూన్ షాపులకి లింక్ పెట్టి తేల్చేశారు.

ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రెస్ మీట్లో మందుకొడితే చూడాలని ఉందని మరో బాంబు పేల్చారు వర్మ. ఇలా పదే పదే మందు గురించి మాట్లాడుతూ, మందుబాబుల సంఘానికి నాయకుడైపోయిన వర్మ తాజాగా మరో ట్వీట్ వేశారు. అది కూడా మందు గురించే.

ఆల్కహాల్ లేకపోవడంతో దానికి అలవాటు పడ్డవారి ఫ్రస్టేషన్ లెవల్స్ పెరిగిపోతున్నాయని, ఈ సమస్య పరిష్కారం కోసం నాయకులు కృషిచేయాలని, వైన్ షాపులు తెరవాలని కోరారు. మందు లేకపోవడంతో మొగుళ్లంతా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారని, ఇది అనవసర గృహహింసకు దారి తీస్తోందని, పాలకులపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందని అన్నారు.

అసలు ఆల్కహాల్ కీ, కరోనాకీ సంబంధం ఏంటి? ఎవరైనా ఎక్కడా ఆల్కహాల్ వల్ల కరోనా వచ్చిందని చెప్పారా అంటూ ప్రశ్నిస్తున్నారు వర్మ. ఆయన లాజిక్ ఆయనది, వైన్ షాపులు తెరిస్తే.. సోషల్ డిస్టెన్స్ అన్నదే మర్చిపోతారని, కరోనా కష్టకాలంలో ఉన్న సేవింగ్స్ కాస్తా మందుపై ఖర్చుపెడితే మధ్యతరగతి బతికేదెట్లా అనేది ప్రభుత్వాల ఆలోచన. అందుకే ఆదాయం తగ్గిపోతున్నా.. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోలేక మందు షాపుల్ని మాత్రం మూసే ఉంచుతున్నాయి ప్రభుత్వాలు.

అయితే నెటిజన్లు మాత్రం వర్మకే సపోర్ట్ ఇవ్వడం విశేషం. వర్మ ట్వీట్ కి వంతపాడుతూ, కామెడీ మీమ్స్ జతచేస్తూ నెటిజన్లు రీట్వీట్లు కొడుతున్నారు. వర్మ చెప్పిన పాయింట్ బాగుందని, ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలని, మందుని కూడా నిత్యావసరాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వర్మని సపోర్ట్ చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు మందు విషయంలో ఏమాత్రం నిబంధనలు సడలించినా అది రామ్ గోపాల్ వర్మ ఖాతాలోకే వెళ్తుందని, ఆయన తమ ఉద్యమ నాయకుడని కొంతమంది కీర్తిస్తున్నారు. మొత్తమ్మీద కరోనా వేళ వర్మ మందుబాబులకి అనుకూలంగా ట్వీట్లు వేస్తూ.. వారికి ఆరాధ్య దైవంగా మారిపోయాడు.