క‌రోనా క్రైసిస్ చారిటీ సంస్థ‌కు రామోజీ రావు విరాళం

ఇప్పుడు టాలీవుడ్లో ఓ ప‌ది సినిమాలు నిర్మించ‌డాన్నే గొప్ప‌గా ఫీల‌వుతున్నారు నిర్మాత‌లు. అలాంటిది రామోజీ రావు 90 దాకా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కానీ ఏ రోజూ త‌న సినిమాల గురించి ఆయన బ‌య‌టికొచ్చి మాట్లాడింది లేదు. ఓ సినిమా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ది లేదు. అస‌లు సౌండే లేకుండా గొప్ప గొప్ప సినిమాలు తీసి ప‌డేశారాయ‌న‌. ఐతే వ‌య‌సు మీద ప‌డ్డాక‌.. ఓపిక త‌గ్గి.. త‌న టీం కూడా బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల‌ ఆయ‌న సినిమాల నిర్మాణం ఆపేశారు.

మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకుని ఆ త‌ర్వాత‌ న‌చ్చావులే, నువ్విలా లాంటి కొన్ని సినిమాలు నిర్మించారు కానీ.. వ‌రుస‌గా సినిమాలు బోల్తా కొట్ట‌డంతో ఇక చాల‌ని ఆపేశారు. ఇప్పుడు రామోజీ ఓ నిర్మాత అని అంద‌రూ మ‌రిచిపోయారు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న‌లోని ప్రొడ్యూస‌ర్ మ‌ళ్లీ నిద్ర లేచాడు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినీ కార్య‌క‌లాపాలు ఆగిపోవ‌డంతో ఇబ్బంది ప‌డుతున్న కార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ చారిటీ సంస్థ‌కు రామోజీ రావు రూ.10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు రూ.10 కోట్ల చొప్పున మొత్తంగా రూ.20 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఐతే ఫిలిం సెల‌బ్రెటీలు ఇలా ప్ర‌భుత్వాల‌కు విరాళం ఇవ్వ‌డంతో పాటు ప‌రిశ్ర‌మ‌లోని కార్మికుల కోసం ప్ర‌త్యేకంగా విరాళం అంద‌జేస్తున్నారు. రామోజీ కూడా అదే బాట ప‌ట్టారు. తాను సినీ నిర్మాత‌న‌నే విష‌యాన్ని గుర్తుంచుకుని సీసీసీకి విరాళం ప్ర‌క‌టించారు. దీని గురించి మెగాస్టార్ ట్విట్ట‌ర్లో వెల్ల‌డిస్తూ రామోజీని పొగిడారు. ఆయ‌నో లెజెండ్ అని.. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న చేసిన సేవ‌లు అస‌మాన‌మ‌ని కొనియాడారు.