ఈ హీరో దాంట్లో మ‌రో ప‌వ‌న్‌క‌ల్యాణే…

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో లాక్‌డౌన్ పుణ్య‌మా అని మ‌రో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెలుగు చూశాడు. ఇంత కాలం ఈ హీరోగారికి అచ్చం ప‌వ‌న్‌క‌ల్యాణ్ బుద్ధులున్నాయ‌నే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. లేట్‌గానైనా లేటెస్ట్‌గా ఆ హీరో మంచి ల‌క్ష‌ణం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. ఇంత‌కూ ఆ హీరో ఎవ‌రంటే…ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్‌బాబు త‌న‌యుడు రానా.

క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో షూటింగ్స్‌ను ప‌క్క‌న పెట్టేసి ఇళ్లకే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకుంటున్నార‌నే ప్ర‌శ్న‌కు హీరో రానా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు.

‘‘విభిన్న విష‌యాల‌ను తెలుసుకోవాల‌నే ఆస‌క్తి నాలో ఎక్కువ‌. నా లాంటి వ్యక్తులు లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడ్డ ఖాళీ సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటారు. నేను అదే చేస్తున్నాను. నా వ‌ర‌కైతే పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. మామూలు రోజుల్లో షూటింగ్స్ బిజీలో పుస్త‌కాలు చ‌ద‌వ‌డానికి తీరిక దొర‌క‌దు. లాక్‌డౌన్ పుణ్య‌మా అని కావాల్సినంత స‌మ‌యం దొరికింది. పుస్తకాలు చదివితే వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లుంటుంది. అది ఇప్పుడున్న ప్రపంచం కన్నా బాగుండొచ్చు (సరదాగా). అలాగే ఆత్మపరిశీలన చేసుకుంటున్నాను’’ అని రానా చెప్పుకొచ్చాడు.

అగ్ర‌హీరో , జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా త‌న‌కు పుస్త‌కాలంటే పిచ్చి అని ఎన్నోసార్లు చెప్పిన విష‌యం తెలిసింది. వేలాది పుస్త‌కాలు చ‌దివిన‌ట్టు ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించాడు. ఇప్పుడాయ‌న బాట‌లో వెళుతున్న మ‌రో హీరో రానాను చూస్తున్నాం.

కాగా కరోనా మహమ్మారి గురించి రానా మాట్లాడుతూ – కరోనా తర్వాత మన జీవన విధానంలో మార్పులు వస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. మనం ఇంత‌కు ముందులా ఉండ‌లేమ‌ని ఆయ‌న అన్నాడు.