ఎక్స్ క్లూజివ్: శ్రీ రాపాకతో ఇంటర్వ్యూ: ఆర్జీవీతో ‘ఆ ముచ్చట’ – ‘నగ్న’ సత్యమిదే.!

స్వీటీ అలియాస్‌ శ్రీ రాపాక.. అనూహ్యంగా సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎవరీ స్వీటీ అలియాస్‌ శ్రీ రాపాక.? అంటే, ఆమె గతంలో ‘వలయం’ అనే ఓ సినిమాలో నటించింది. పలు సినిమాలకు కాస్ట్యూవ్స్‌ు డిజైనర్‌గా వ్యవహరించింది. రామ్ గోపాల్‌ వర్మ రూపొందించిన ‘నగ్నం’తో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఫొటోలు, ప్రోమోస్‌తో ‘సెగ’ రేపిన శ్రీ రాపాక, ‘నగ్నం’తో తాను అస్సలేమాత్రం ఊహించనంత ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఈ బ్యూటీతో తెలుగు బులెటిన్‌ డాట్‌ కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ‘వర్మకి అమ్మాయిలంటే అదో ఇది..’ అంటూ జరిగే ప్రచారంలో నిజమెంత.? కేవలం డబ్బు కోసమే ‘నగ్నం’ సినిమాలో శ్రీ రాపాక నటించిందా.? ఏ ‘కమిట్‌మెంట్‌’ ఇవ్వకుండానే ఆమెకు ‘నగ్నం’ సినిమాలో అవకాశమొచ్చిందా.? ఇలాంటి చాలా ప్రశ్నలకు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ సమాధానాలిచ్చింది శ్రీ రాపాక. ఇంకెందుకు ఆలస్యం.. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం.!

మీ నేపథ్యమేంటి.?

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మా ఊరు. సినిమాల పట్ల ఆసక్తితో సినీ రంగంలో కాస్ట్యూవ్స్‌ు డిజైనర్‌గా పనిచేశాను. ‘దేశముదురు’ నాకు కాస్టూవ్స్‌ు డిజైనర్‌గా తొలి చిత్రం. ఆ తర్వాత చాలా విజయవంతమైన సినిమాలకు వర్క్‌ చేసి, నటనపై ఆసక్తితో ఆ దిశగా అడుగులేశాను. అనుకోకుండా ‘వలయం’ అనే సినిమాలో నటించాల్సి వచ్చింది. తమిళంలోనూ ఓ సినిమా చేశానుగానీ, కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లోనూ నాకు ఫ్రెండ్స్‌ ఎక్కువగానే వున్నారు.

‘నగ్నం’ సినిమాలో ఛాన్స్‌ ఎలా వచ్చింది.?

ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ద్వారా ఈ సినిమా అవకాశం నాకొచ్చింది. రామ్ గోపాల్‌ వర్మ సినిమా అనగానే ఎగిరి గంతేశాను. ఆయన గురించి చాలామంది చాలా బ్యాడ్‌గా చెప్పినా, ఆయన మీద నాకు గౌరవం వుంది. ‘నగ్నం’ సినిమా చేశాక ఆ గౌరవం మరింత పెరిగింది. రెండే రోజుల్లో సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది. అయితే, సినిమాకి సంబంధించిన విషయాలు తప్ప, ఇతరత్రా విషయాలు మాట్లాడుకునేంత టైమ్ కూడా దొరకలేదు మా ఇద్దరికీ.

ఇలాంటి సినిమాలో నటించడమేంటని ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించలేదా.?

కొంతమంది ప్రశ్నించారు. కానీ, నాకు తెలుసు నేనేం చేస్తున్నానో. నేనే కాదు, చాలామంది హీరోయిన్లు గ్లామరస్‌గా కన్పిస్తారు. నేను చేసింది కూడా అదే. సినిమాలో నా పాత్రకి నేను న్యాయం చేశాను. సినిమా చూశాక అంతా ప్రశంసిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రికి రాత్రి స్టార్‌డమ్ వచ్చేసింది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విజయ్‌ దేవరకొండకి ఎలాగో, ‘నగ్నం’ సినిమా నాకు అలాగని చాలామంది చెబుతోంటే చాలా ఆనందంగా అన్పిస్తోంది.

వర్మకి అమ్మాయిలంటే పిచ్చి.. అనే ప్రచారం వుంది కదా.! మీరేమంటారు.?

వర్మ పిచ్చోడు.. అవును, రామ్ గోపాల్‌ వర్మ పని పిచ్చోడు. సినిమా తప్ప, ఆయన ఇంకేమీ ఆలోచించడు. ‘కమిట్‌మెంట్‌’ ఇస్తే తప్ప వర్మ ఎవరితోనూ సినిమాలు చేయడన్నదే నిజమైతే, మరి ఆయన శ్రీదేవితో కూడా సినిమాలు చేశాడు కదా.! సో, అదంతా ట్రాష్‌. వర్మ ట్రూ జెంటిల్‌మెన్‌. ఆయనంటే గిట్టనివారు ఏదేదో దుష్ప్రచారం చేస్తుంటారు. సినిమాని ఎలా తీయాలో, ఎలా మార్కెట్‌ చేయాలో ఆయనకు బాగా తెలుసు. తాను నమ్మింది తెరకెక్కించడంలో ఆయన డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నేచర్‌కి హేట్సాఫ్‌.

‘నగ్నం’ సీక్వెల్‌ వస్తోందట కదా!

ఏమో, ఆ విషయం నాకు తెలియదు. అది రామ్ గోపాల్‌ వర్మని అడగాల్సిన ప్రశ్న. నాకు తెలిసినంతవరకూ, సీక్వెల్‌ వుండకపోవచ్చు.

వర్మ డబ్బుల కోసం ఏమైనా చేస్తాడట కదా!

ఆయనకి సినిమా అంటే ప్యాషన్‌. అందుకే ఆయన సినిమాలు చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో సినిమా చేయడమంటే చిన్న విషయం కాదు. అది వర్మకి మాత్రమే చెల్లింది. కేవలం డబ్బుల కోసమే అయితే, ఆయన చాలామంది స్టార్స్‌తో సినిమాలు చేయగలరు.

డబ్బుల్లేక వర్మ, తన ఆఫీస్‌లో ఫర్నిచర్‌ అమ్మేసుకున్నాడని అంటున్నారు.?

అదంతా ఉత్తిదే. ఆయన ఆఫీస్‌ వున్న భూమి కొన్ని కోట్ల ఖరీదు చేస్తుంది. ఆయనకి డబ్బుతో పని లేదు. ఆయన క్రియేటివిటీని డబ్బుతో కొనలేం. సినిమా పట్ల కమిట్‌మెంట్‌ వున్న వ్యక్తి ఆయన. ఎప్పుడూ కొత్తదనం గురించే ఆలోచిస్తుంటారు. రామ్ గోపాల్‌ వర్మ రోజులో 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. మిగతా టైమ్ అంతా ఆయన సినిమా కోసమే కేటాయిస్తారు. అదీ సినిమా పట్ల ఆయన నిబద్ధత.

‘నగ్నం’ పైరసీ చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. దీనిపై మీ కామెంట్‌?

పైరసీ అనేది సినిమాకి పట్టిన జాడ్యం. అదృష్టవశాత్తూ ‘నగ్నం’పై పైరసీ ఎఫెక్ట్‌ పడలేదు. అంత జాగ్రత్తగా ప్లాన్‌ చేశారు నిర్మాతలు. నిర్మాత బావుంటేనే సినీ పరిశ్రమ బావుంటుంది. పైరసీ కారణంగా నిర్మాత నష్టపోతే సినిమా పరిశ్రమ ఎలా బాగుపడుతుంది.?

డబ్బు కోసమే ‘నగ్నం’ లాంటి సినిమా ఒప్పుకున్నారా?

నేనొక కాస్ట్యూమ్స్ డిజైనర్‌ని. సినీ పరిశ్రమలో తగినంత సంపాదించుకున్నాను. కెరీర్‌ మొదట్లో నేను ఏడాదిపాటు గ్రీన్‌ పార్క్‌ హోటల్‌లో వుండేదాన్ని. నా ఖర్చులకు నేను సంపాదించుకోగలను. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ డబ్బులకి సమస్య లేదు. నటన అనేది నాకు చాలా ఇష్టం. అంతే తప్ప, డబ్బు కోసమే ఇలాంటి సినిమాలు ఒప్పుకున్నాననడం సబబు కాదు.

సినీ పరిశ్రమలో ‘కమిట్‌మెంట్‌’ గురించి చాలా చర్చ జరుగుతోంది. మీకు అలాంటి అనుభవం ఏదైనా జరిగిందా.?

కమిట్‌మెంట్‌కి తలొగ్గాలా.? వద్దా.? అన్నది మనం తీసకునే నిర్ణయం. కమిట్‌మెంట్‌ ఇవ్వకూడదని మనం నిర్ణయించుకుంటే, ఎవరూ మన మీద ఒత్తిడి తీసుకురాలేరు. నన్ను కమిట్‌మెంట్‌ ఇవ్వమని అడిగేంత సీన్‌ ఎవరికీ లేదు.

కొందరు హీరోలతో, హీరోయిన్లతో మీకు తేడాలొచ్చాయనే ప్రచారం వుంది కదా.!

నాకు నచ్చని పని నేను చెయ్యను. తప్పు జరుగుతోంటే ప్రశ్నిస్తాను. ఈ క్రమంలో ఎవరన్నా నా ఆటిట్యూడ్‌ నచ్చక అలా అనుకున్నారేమో. నేనెవరితోనూ గొడవపడింది లేదు.

సోషల్‌ మీడియాలో వస్తున్న నెగెటివ్‌ కామెంట్స్‌పై మీరేమంటారు.?

చాలామంది మెచ్చుకుంటున్నారు. కొందరు పనీ పాటా లేనోళ్ళు ఏవేవో కామెంట్లు వేస్తుంటారు. వాళ్ళను పట్టించుకోవడం అనవసరం. ‘నగ్నం’ సూపర్‌ హిట్‌ అయ్యింది. నాకు పేరొచ్చింది. ఈ క్రెడిట్‌ అంతా రామ్ గోపాల్‌ వర్మదే.

మీ చేతిలో వున్న కొత్త ప్రాజెక్ట్స్‌.?

ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌కి హాజరవుతున్నాను. మరో రెండు సినిమాలు చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి. తమిళంలో కూడా ఛాన్సులున్నాయి.

ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది వుంటుందంటారు. మరి, మహిళ అయిన మీ విజయం వెనుక ఎవరున్నారు.?

నా కుటుంబ ప్రోత్సాహం లేకుండా నేనేమీ చెయ్యలేనేమో అన్పిస్తుంటుంది. సినిమా రంగంపై నాకున్న ఇష్టాన్ని చెప్పినప్పుడు తొలుత కొంత సంశయించినా, నా ఆలోచనలకి అడ్డు చెప్పలేదు. నా వెనుక కొండంత బలం నా కుటుంబమే. నేను ఏం చేసినా నాకు మంచి అనుకున్నదే చేస్తానని నా కుటుంబానికి తెలుసు.