రేసు గుర్రం రేవంత్ కు సీనియర్ల బ్రేకులు

ఎంత లేదన్నా.. ఎవరు కాదన్నా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ లో కదలిక వచ్చిందన్నది వాస్తవం. అయితే రేవంత్ కు పీసీసీ దక్కడం ఇష్టం లేని పలువురు సీనియర్లు సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. వీరిలో మరీ ముఖ్యంగా నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. ఓ దశలో పార్టీకి తనకు సంబంధం లేదన్నంత వరకు వెళ్లారాయన. రేవంత్ ఎంత కలుపుకొని పోదామని యత్నిస్తున్నా.. కోమటిరెడ్డి కలిసి రావడం లేదు.

ఇది ఎన్నోసార్లు స్పష్టమైంది కూడా. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని రేవంత్ కు పరోక్షంగా ముడిపెడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పనితీరును ప్రశ్నించినట్టే చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలైనా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది రాష్ట్ర పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క సభ కూడా పెట్టలేదని విమర్శించారు. అంతేగాక రేవంత్ పీసీసీ చీఫ్ కాక ముందు జరిగిన దుబ్బాక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పనిచేసినట్లు హుజూరాబాద్ లో పార్టీ పనిచేయలేదని అన్నారు. కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో గట్టి క్యాడర్ ఉందని.. అయినా ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయలేదని అన్నారు.

హుజూరాబాద్ పై వాస్తవ పరిస్థితి ని హైకమాండ్ కు వివరిస్తానన్నారు. అంటే.. ఇది రేవంత్ వైఫల్యమేనని చెప్పకనే చెప్పారు. పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి కూడా వెళ్లని కోమటిరెడ్డి.. చివరగా మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులోనే ఉంటానని చెప్పడం ఆశ్చర్యకరం. కాగా వీహెచ్ జానారెడ్డి జీవన్ రెడ్డి వంటి సీనియర్లు రేవంత్ కు అండగానే ఉంటున్నా.. రేవంత్ సమకాలీకులైన కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తిగా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మరింత గట్టిగా నిరసన స్వరం వినిపిస్తున్నారు.

పార్టీలో ఉండలేక వెళ్లలేక అన్నట్టు కొనసాగుతున్నారు. కొన్నిసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్నిసార్లు బీజేపీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ మంత్రులతో సై అంటే సై అంటుంటారు. ఇక అన్న వెంకట్ రెడ్డి పీసీసీ దక్కక పోయే సరికి తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తానని ప్రకటించి వెనక్కుతగ్గారు. తర్వాత నియోజకవర్గానికి పరిమితం అవుతానని అన్నారు. ఇప్పుడు హుజూరాబాద్ ఫలితం తర్వాత మాత్రం రాష్ట్ర నాయకుడి తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. వెంకట్ రెడ్డి తీరు నేరుగా రేవంత్ ను వ్యతిరేకిస్తున్నట్లు ఉంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కిన జగ్గారెడ్డి తీరు మరోలా ఉంది. కీలక పదవిలో ఉండి కూడా ఈయన హుజూరాబాద్ ప్రచారానికి వెళ్లలేదు.

అదేమంటే.. ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని బీజేపీ టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు పంచాయని దానిని చూడలేక ఆవేదనతో ప్రచారానికి వెళ్లలేదని చెప్పకొచ్చారు. మరోవైపు హుజూరాబాద్ లో గెలిచినది ఈటల అని.. అది బీజేపీ గెలుపు కాదని పేర్కొన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మొత్తంమీద చూస్తే పీసీసీ చీఫ్ రేవంత్ ఎంత దూకుడుగా ముందుకెళ్దామన్నా.. సీనియర్ల రూపంలో ఆయనకు స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తెచ్చే నాయకుడిగా చాలామంది భావిస్తున్న రేవంత్.. ఈ అడ్డంకులను దాటుకుంటూ ఎలా వెళ్తారో చూడాలి.