దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” ను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు రాజమౌళికి కలలోనైనా అలాంటి ఆలోచన వచ్చి ఉంటుందా? ఒకవేళ “ఆర్ఆర్ఆర్” ఓటీటీలో రిలీజైతే రెవెన్యూ పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.
“ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో రిలీజ్ చేయమని రాజమౌళికి చెప్పాను. ఆయన ఎక్కడ రిలీజ్ చేసుకుంటారనేది రాజమౌళి ఇష్టం. నా అభిప్రాయం ఏంటంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు ఎంతమంది వస్తారనేది ప్రశ్న. గతంలోలా రారనే అనుమానం ఉన్నప్పుడు ఓటీటీ అనేది ఓ ప్రత్యామ్నాయం. థియేటర్లలో నేను రిలీజ్ చేయొద్దని చెప్పడం లేదు. ఫైనాన్షియల్ కోణంలో చూసుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ను ఓటీటీలో రిలీజ్ చేస్తే థియేట్రికల్ రెవెన్యూ కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది. ఇదే విషయం రాజమౌళికి చెప్పాను.”
ఇలా రాజమౌళికి ఓ ఉచిత సలహా పడేశాడంట వర్మ. కరోనా పరిస్థితుల్లో “ఆర్ఆర్ఆర్”ను థియేట్రికల్ తో పాటు ఒకేసారి ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ అంటున్నాడు.
రాబోయే రెండేళ్లలో 70శాతం థియేట్రికల్ రెవెన్యూను కచ్చితంగా ఓటీటీ దెబ్బకొడుతుందని అంచనా వేస్తున్న వర్మ.. కరోనా తర్వాత థియేట్రికల్ రిలీజ్, థియేట్రికల్ వ్యూయింగ్ అనేది మరింత కాస్ట్ లీ అవుతుందని, అదే సమయంలో ఓటీటీ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నాడు.