పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. కానీ, ఈసారెందుకో ‘పవర్ స్టార్’తో ఆర్జీవీ చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్లు తిరిగి ఆయనకే గట్టిగా కొట్టేస్తున్నాయి. ఆర్జీవీ ‘పవర్‌స్టార్’ పేరుతో సినిమా చేస్తే, ‘పరాన్నజీవి’ పేరుతో ఆయన మీద ఓ సినిమా షురూ అయ్యింది. అంతేనా, ఇంకో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లో వున్నాయి. నిజానికి వీటిని సినిమాలని అనకూడదు. వర్మ ఎవర్నో ఏదో అనాలనుకుని, అనలేక.. తనకు తెలిసిన విద్య సినిమా కావడంతో, దాన్ని అడ్డంపెట్టుకుని చేయాలనుకున్నది చేసేస్తున్నాడు.
‘పచ్చకామెర్లున్న వర్మ, ఆ పచ్చకామెర్లకు ట్రీట్‌మెంట్ చేయించుకోవట్లేదు..’ అని ఓ న్యూస్ ఛానల్ యాంకర్, వర్మని డైరెక్టుగానే ప్రశ్నించేస్థాయికి పడిపోయింది ఆయనగారి ఘనత. ఇంకోపక్క హీరో నిఖిల్ పవన్ కళ్యాణ్‌ని శిఖరంతో పోల్చుతూ ఓ ట్వీటేశాడు. శిఖరాన్ని చూసి కుక్క మొరిగినా, ఆ శిఖరం తన తల తిప్పి చూడదని పేర్కొన్నాడు. ఇక్కడ ‘కుక్క’ ఎవరు.? అన్న దానిపై ఎవరి వాదన వారిదే. నిఖిల్ ఇలా అన్నాడట కదా.. అన్న ప్రశ్నకి ‘నిఖిల్ ఎవడో నాకు తెలియదు.. నిఖిలో గిఖిలో.. పవన్ కళ్యాణ్ తమని గుర్తిస్తారని చేసే ప్రయత్నాలివి..’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ‘బానిసత్వం’ అనే మాట కూడా వాడాడు వర్మ. మరి, ఆర్జీవీ చేస్తున్నదేంటి.? ఈ బానిసత్వం ఎవరి మెప్పు కోసం.? అన్న చర్చ జరగకుండా వుంటుందా.?
‘ఆర్జీవీ ఎవడో.! గీర్జీవీ ఎవడో.. పవన్ కళ్యాణ్ తనని పట్టించుకుంటాడేమోనని పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడు..’ అని ఆర్జీవీ మీదనే సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లకి ఈ దర్శకుడు ఏం సమాధానమిస్తాడు.? ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎవరు ఎలాగైనా మాట్లాడొచ్చు, కామెంట్ చేయొచ్చంటే.. పరిస్థితి ఇలాగే వుంటుంది.
పవన్ కళ్యాణ్‌ని పోలిన పాత్రలతో వర్మ సినిమాల్లాంటివి చేస్తోంటే, వర్మని పోలిన పాత్రలతోనూ సినిమాలు వస్తున్నాయి. గతంలో ఈ పరిస్థితి పెద్దగా కన్పించలేదు. చిన్న చిన్న కామెడీ స్కిట్స్‌కే వర్మ లాంటి పాత్రలు పరిమితమయ్యేవి. ఇప్పుడేమో పరాన్నజీవి అంటున్నారు.. ఇంకేవేవో అంటున్నారు. ‘ఇలాంటివన్నీ నాకు మైలేజ్ పెంచుతాయి..’ అని వర్మ భావిస్తేనో.! ఏదిఏమైనా, ఈసారి వర్మకి బాగా తేడా కొట్టేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలావరకు లైట్ తీసుకున్నారు. కొంతమంది మాత్రం, స్పందిస్తున్నారు.. అలా వర్మ ఆశించిన ‘పబ్లిసిటీ’ కొంతమేరకు లభించింది. కానీ, వర్మ గతంతో పోల్చితే.. ఈసారి ‘కౌంటర్ ఎటాక్’ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.