లాక్‌డౌన్‌తో మూతబడ్డ థియేటర్లు ‘కరోనా’తో ఓపెన్‌

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు ఏడు నెలలు థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన కండీషన్స్‌ పెట్టి థియేటర్ల అన్‌ లాక్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల 15 నుండి థియేటర్లను అన్‌ లాక్‌ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లకు కూడా అనుమతులు వచ్చాయి. అయితే థియేటర్లు సగం ఆక్కుపెన్సీతో మాత్రమే నడిపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థియేటర్లు అయితే ఓపెన్‌ అవ్వబోతున్నాయి కాని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలో నేనున్నాను అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటన చేశాడు. వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ లాక్‌ డౌన్‌ టైమ్‌ లో షూట్‌ చేసిన ‘కరోనా వైరస్‌’ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా ఆయన చేశాడు. లాక్‌ డౌన్‌ తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా తమ ‘కరోనా వైరస్‌’ అంటూ ఆయన అధికారికంగా ప్రకటించాడు. థియేటర్లలో తమ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా పేర్కొన్నాడు.

పూర్తి సినిమాను లాక్‌ డౌన్‌ టైమ్‌ లోనే పూర్తి చేశాం. లాక్‌ డౌన్‌ వల్ల మూత పడ్డ థియేటర్లను తమ సినిమా కరోనా వైరస్‌ తో ఓపెన్‌ చేయబోతున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. మొత్తానికి వర్మ ఏం చేసినా కూడా విభిన్నంగా ఉంటుంది అనేందుకు ఇది మరో సాక్ష్యం. కరోనా వైరస్‌ సినిమాను అతి తక్కువ బడ్జెట్‌ తో వర్మ తెరకెక్కించాడు. కనుక థియేటర్లకు జనాలు ఎంత మంది వచ్చినా కూడా లాభాలు రావడం ఖాయం. వర్మ ఈ సినిమాను తక్కువ సంఖ్య థియేటర్లలో విడుదల చేసి ఆ తర్వాత థియేటర్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.