వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. ఏమైనా సరే.. ఏపీ ప్రభుత్వం మీదా.. అందునా జగన్ అండ్ కో మీద ఈగ వాలటానికి సైతం ఇష్టపడని రీతిలో వ్యవహరించే రాంగోపాల్ వర్మ.. తొలిసారి ఏపీ ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపే ఆయన.. తరచూ సంచలనాలకుకేరాఫ్ అడ్రస్ గా ఉండటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడేళ్లలో ఎప్పుడూ కూడా.. ఒక్క నిర్ణయాన్ని తప్పుగా ఎత్తి చూపేందుకు ఇష్టపడని వర్మ.. తాజాగా మాత్రం సినిమా టికెట్ల ధరల్ని తగ్గించటంపై స్పందించారు.
ఇప్పటికే ఇదే అంశం మీద ఇద్దరు.. ముగ్గురు హీరోలు స్పందించటం.. వారిపై ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలు విరుచుకుపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా సినిమా టికెట్ల ధరల్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా తప్పుగా తేల్చారు. ”ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు” అని పేర్కొన్న ఆయన.. తన మాటకు లాజిక్ కూడా చెప్పేశారు. ఉత్పత్తిదారులకు ధరను నిర్ణయించుకునే హక్కు ఉందన్న ఆయన.. దాన్ని కొనాలా? వద్దా? అనేది మాత్రం వినియోగదారుడి ఇష్టమన్నారు.
టికెట్ ధర ఎంత ఉన్నా నచ్చిన వాళ్లు మాత్రమే చూస్తారని.. నచ్చని వారు చూసే అవకాశమే లేదన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఒక పోలికను పోల్చారు. సాధారణ కారు ధరకు బెంజ్ కారు ఇవ్వాలంటే ఎలా? టికెట్ ధరలు తగ్గించటం ద్వారా ప్రభుత్వం కావాలనే సినిమా ఇండస్ట్రీ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తుందా? లేదా? అనేది తనకు తెలీదన్నారు. సినిమా టికెట్ ధరల్ని తగ్గించటం వల్ల హీరోలకు ఎలాంటి నష్టం వాటిల్లదని.. నిర్మాతకే నష్టమని విశ్లేషించారు.
టికెట్ ధరల్ని తగ్గించటం ద్వారా అగ్రహీరోల ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయటం అసాధ్యమని.. ప్రభుత్వం ఏం చేసినా హీరోల పారితోషికం తగ్గదన్నారు. ‘పెద్ద హీరోల పారితోషికం తగ్గటం అసాధ్యం. టికెట్ ధరల్ని తగ్గించటం నిర్మాతలకు నష్టం. ముమ్మాటికి ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పే’ అని వర్మ తేల్చి చెప్పారు.టికెట్ ధరల్ని తగ్గించటంపై ఇంత స్పష్టంగా మాట్లాడిన వర్మ వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్ష నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.