వర్మ చాలా మారిపోయాడండీ…

రామ్ గోపాల్ వర్మలో ఈ మధ్య చాలా చాలా మార్పులొచ్చేస్తున్నాయి. కొత్తగా ఆయనలో పశ్చాత్తాప భావనలు కనిపించడం చూశాం. ఇంతకుముందు ఎవ్వరినీ టాలరేట్ చేయకుండా తనకు ఏమనిపిస్తే అది అనేసేవాడు వర్మ. ట్విట్టర్లో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఆయన ఎలాంటి కామెంట్లు చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ మధ్య ఆ కామెంట్ల విషయంలో పశ్చాత్తాప పడుతూ క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ‘నక్షత్రం’ ఆడియో వేడుక సందర్భంగా వర్మ పంపిన వీడియో బైట్ చూసిన వాళ్లకు మరింతగా ఆశ్చర్యం కలిగింది.

తాను నిజానికి ‘నక్షత్రం’ ఆడియో వేడుకకు రావాల్సిందని.. కానీ ఒక ఇంపార్టెంట్ షూటింగ్ ఉండటంతో రాలేకపోయానని.. ఇందుకు కృష్ణవంశీకి సారీ అని  అన్నాడు వర్మ. ఐతే ‘నక్షత్రం’ ట్రైలర్ చూశానని.. చాలా చాలా బాగుందని.. సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు వర్మ. ట్రైలర్ చూస్తే సినిమాలో మంచి మాస్ కమర్షియల్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఉందనిపిస్తోందని.. హీరోలిద్దరూ చాలా బాగా కనిపిస్తున్నారని.. ఈ సినిమా మీద చాలా మంచి బజ్ ఉందని తనకు చెప్పారని అంటూ.. సినిమా పెద్ద హిట్టవ్వాలని ఆకాంక్షిస్తూ.. ఆల్ ద బెస్ట్ చెప్పాడు వర్మ.

ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏ సినిమా గురించి కూడా ఇలా వర్మ మొక్కుబడి మాటలు మాట్లాడ్డం చూసి ఉండరు. అసలు తన సినిమాల గురించే వర్మ ఇలా చెప్పుకోడు. తన శిష్యుల సినిమాల గురించి కూడా ఇలాంటి స్టీరియో టైపు మాటలు మాట్లాడడు. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉందని.. మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తోందని… ఇలాంటి మాటలు వర్మ నుంచి ఎప్పుడూ విని ఉండం. ఐతే కాలంతో పాటు వర్మ కూడా మారుతూ.. అందరిలో ఒకడైపోతున్నట్లుగా అనిపిస్తోంది ఆయన మాటలు చూస్తే.