గుళ్లలో పవన్ విగ్రహాలు పెట్టమంటున్న వర్మ

రామ్ గోపాల్ వర్మ మళ్లీ లైన్లోకి వచ్చాడు. ఆయన ఫోకస్ మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మీదికి మళ్లింది. ఎవరో పవన్ గురించి తమాషాగా పెట్టిన ఒక మెసేజ్ ను పట్టుకుని ఆయన రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ దేవుడని.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో ఉన్న దేవుళ్ల విగ్రహాల్ని తీసేసి.. పవన్ విగ్రహాలు పెట్టాలని సెలవిచ్చాడు వర్మ. పవన్ దేవుడని తాను మనస్ఫూర్తిగా నమ్ముతానని వర్మ వ్యాఖ్యానించడం విశేషం.

పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్లో అప్పుడప్పుడూ తెలుగులో మెసేజ్ రాయించి.. వాటిని ఇమేజ్ గా మార్చి ట్వీట్ చేస్తుంటాడు. సరిగ్గా ఆయన ట్వీట్లలో కనిపించే ఫాంట్ తోనే ఎవరో ఒక సెటైరికల్ మెసేజ్ వర్మకు షేర్ చేశారు. తనకు మొక్కలంటే ప్రేమ అని.. పొలంలో ఎండిపోయి ఉన్న ఒక గులాబీ మొక్కను పట్టుకుంటే దానికి కొత్త జీవం వచ్చిందని.. ఆదిలాబాద్ జిల్లాలో కరవు ప్రాంతంలోకి వెళ్లి ఒక చోట అడుగుపెడితే అక్కడ నీళ్లు పడ్డాయని.. ఇలా చాలా తమాషాగా ఉందా మెసేజ్.

ఇది పవన్ కళ్యాణ్ నిజంగానే పెట్టిన మెసేజ్ అనుకున్నాడో లేక ఫేక్ అని గుర్తించాడో తెలియదు కానీ.. దానికి స్పందనగా ‘‘పవన్ దేవుడు అని నేను ఎప్పుడూ నమ్ముతాను. బాలాజీ.. యాగదిరి గుట్ట స్వామి.. భద్రాచలం రాముడు.. మొదలైన దేవుళ్లందరినీ పవన్ విగ్రహంతో రీప్లేస్ చేయాలి’’ అని ట్వీట్ చేశాడు వర్మ. ఈ ట్వీట్ చూసి కొందరు నవ్వుకుంటుంటే.. ఇదేం పైత్యం అంటూ కొందరు వర్మను తిట్టిపోస్తున్నారు.