లాక్‌డౌన్‌ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు హీరోయిన్‌ సమస్య కానుందా?

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్‌ డౌన్‌ వల్ల అన్ని రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్న విషయం తెల్సిందే. సినిమా పరిశ్రమ ముఖ్యంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందనే నమ్మకం లేదని అంటున్నారు. థియేటర్లను కనీసం రెండు నెలలు అయినా మూసేసి ఉంచడమే బెటర్‌ అని ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు పేర్కొన్నారు. ఇక షూటింగ్స్‌ కూడా తీవ్రమైన ఆంక్షల మద్య చేయాల్సి రావచ్చు.

ఇక విదేశాల్లో షూటింగ్స్‌ ఈ ఏడాది చివరి వరకు జరిగే అవకాశం లేదంటున్నారు. ఈ సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై ప్రభావం పడనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లండన్‌కు చెందిన ఓలివియాను ఎన్టీఆర్‌కు జోడీగా నటింపజేస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగ్‌ ఆపేశారు. షూటింగ్‌ మళ్లీ ప్రారంభించిన సమయంలో లండన్‌ నుండి ఓలివియా షూటింగ్‌కు హాజరు అవ్వాల్సి ఉందట.

లండన్‌ నుండి ఆమె రావడం ఎలా అంటూ ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యులు టెన్షన్‌ పడుతున్నారు. లండన్‌లో వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ నుండి విమాన రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. అది ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. దాంతో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో ఓలివియా ఎప్పుడు జాయిన్‌ అవుతుందో, షూటింగ్‌ ఎప్పుడు పూర్తి చేస్తారో అనే టెన్షన్‌ ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతోంది. అయితే జక్కన్న మాత్రం ఖచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నాడు.